ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా.. ఈ కొత్త రూల్స్‌ తెలుసా? | New E Commerce Rules Checks Every Shopper Must Make Before Buying Online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా.. ఈ కొత్త రూల్స్‌ తెలుసా?

Sep 25 2026 7:05 PM | Updated on Sep 25 2026 7:15 PM

New E Commerce Rules Checks Every Shopper Must Make Before Buying Online

ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ సర్వ సాధారణం అయిపోయింది. ఉన్నచోటు నుంచే మొబైల్‌లోనే కావలసిన వస్తువులను బుక్ చేసుకుంటున్నారు, ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇది చాలా సౌకర్యంగా ఉన్నప్పటికీ.. ఇందులో కూడా ప్రమాదాలు కూడా ఉన్నాయి. మనం ఆన్‌లైన్‌లో వస్తువు కొనుగోలు చేసినప్పుడు పేరు, ఫోన్ నంబర్, చిరునామా, పాస్‌వర్డ్, బ్యాంక్ లేదా చెల్లింపు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం కూడా ఆన్‌లైన్‌లోకి వెళ్తుంది. కాబట్టి.. షాపింగ్ చేసేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

భారత ప్రభుత్వం.. ఆన్‌లైన్ షాపింగ్‌లో వినియోగదారులకు మరింత రక్షణ కల్పించడానికి ''వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) (సవరణ) నిబంధనలు, 2026'' జారీ చేసింది. ఈ రూల్స్ జనవరి 2027 నుంచి అమల్లోకి రానున్నాయి.

విక్రేత ఎవరో చూడాలి
మనం ఏ వస్తువు కొనుగోలు చేస్తున్నామని మాత్రమే కాకుండా, దాన్ని ఎవరు అమ్ముతున్నారో కూడా చూడాలి. విక్రేత పేరు, చిరునామా, రేటింగ్, కన్స్యూమర్ సర్వీస్ వివరాలను పరిశీలించాలి. ముఖ్యంగా ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. మంచి ఫోటోలు, మంచి రివ్యూస్ ఉన్నంత మాత్రాన సెల్లర్ నిజమైనవాడని అనుకోకూడదు.

పేమెంట్ చేసేటప్పుడు
పేమెంట్ చేసే ముందు వెబ్‌సైట్ అడ్రస్ చూడాలి. మనం ఉపయోగిస్తున్నది నిజమైన షాపింగ్ వెబ్‌సైట్ అవునో.. కాదో చెక్ చేయాలి. ఎవరైనా ఓటీపీ, యూపీఐ పిన్, ఏటీఎం పిన్, కార్డు పిన్ లేదా పాస్‌వర్డ్‌ అడిగితే ఇవ్వకూడదు. పేమెంట్ సమయంలో అకస్మాత్తుగా వేరే వెబ్‌సైట్ ఓపెన్ అయితే తప్పకుండా జాగ్రత్త పడాలి.

సెర్చ్ విషయంలో
షాపింగ్ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసినప్పుడు మొదట కనిపించే వస్తువునే తొండరపడి కొనేయకూడదు. బహుశా అది ప్రకటన కావొచ్చు. విక్రేత వివరాలు, వస్తువు వివరాలు, రివ్యూలు చూసిన తరువాతనే వస్తువును కొనుగోలు చేయాలి. ప్లాట్‌ఫామ్‌ బయట వెళ్లి పేమెంట్ చేయమని కనిపిస్తే.. అలాంటి వాటిని నమ్మకూడదు.

డార్క్ ప్యాటర్న్‌
కొన్ని వెబ్‌సైట్లు మనకు తెలియకుండానే.. అదనపు సర్వీస్ లేదా చేంజెస్ తీసుకునేలా కన్ఫ్యూజ్‌ ఆప్షన్స్ చూపిస్తాయి. అంటే.. వినియోగదారుని గందరగోళానికి గురిచేస్తాయి. వీటినే డార్క్ ప్యాటర్న్‌ అంటారు. అలాగే పేమెంట్ ఫెయిల్డ్ వంటి మెసేజ్ చూపించి మళ్లీ కార్డు డీటెయిల్స్ లేదా పాస్‌వర్డ్‌ అడిగితే వెంటనే నమ్మకూడదు. ఏదైనా అనుమానంగా అనిపిస్తే అధికారిక వెబ్‌సైట్ చూడాలి.

వ్యక్తిగత సమాచారం విషయంలో
ఆన్‌లైన్ షాపింగ్‌ చేసేటప్పుడు అవసరమైన మేరకు మాత్రమే వ్యక్తిగత సమాచారం ఇవ్వాలి. ఏ సమాచారం ఎందుకు అడుగుతున్నారనే విషయాన్ని ముందు తెలుసుకోవాలి. అంతే కాకుండా.. అన్ని షాపింగ్‌ వెబ్‌సైట్లకు ఒకే పాస్‌వర్డ్‌ ఉపయోగించకూడదు. కఠినమైన పాస్‌వర్డ్‌  ఉపయోగించడం మంచిది.

చెల్లింపు వివరాలు ముఖ్యం
ఏదైనా వస్తువును కొనుగోలు చేసే సమయంలో పేమెంట్ చేసిన తరువాత.. ఇన్వాయిస్, ఆర్డర్ కన్ఫర్మేషన్, పేమెంట్ రిసిప్ట్ వంటివి సేవ్ చేసుకోవాలి. విక్రేతతో జరిపిన సంభాషణ కూడా సేవ్ చేసుకోవడం మంచిది. తర్వాత ఏదైనా సమస్య వస్తే ఈ సమాచారం ఆధారంగా ఫిర్యాదు చేయడానికి ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: ఉద్యోగం మానేస్తే.. హెల్త్ ఇన్సూరెన్స్ పోతుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement