విద్య అంటే కేవలం చదువేనా? | National Education Day Despite Maulana Azad Aspirations Question Arises, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

విద్య అంటే కేవలం చదువేనా?

Nov 11 2025 9:42 AM | Updated on Nov 11 2025 10:50 AM

National Education Day Despite Maulana Azad aspirations question arises

నేడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఏటా నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవం(National Education Day)గా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి మౌలానా ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా అనేక దార్శనిక నిర్ణయాలు తీసుకున్నారు.

  • దేశంలోని ప్రతి పౌరుడికి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రాథమిక విద్య కోసం కృషి చేశారు.

  • దేశంలో పరిశోధనలు, సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికి ఆయన అనేక ఉన్నత విద్యా సంస్థలను స్థాపించడంలో కీలక పాత్ర వహించారు.

  • యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (IITs) వంటి సాంకేతిక విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు.

  • విద్య అంటే కేవలం చదువు మాత్రమే కాదనే ఉద్దేశంతో భారతీయ కళలు, సంస్కృతిని ప్రోత్సహించడానికి సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ, సంగీత నాటక అకాడమీ వంటి సంస్థలను స్థాపించారు.

  • సెకండరీ విద్యలో మార్పులు తీసుకురావడానికి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ (ముదలియార్ కమిషన్) ఏర్పాటుకు సహకరించారు.

అసలు విద్య అంటే..

మౌలానా ఆజాద్ ఆశయాలను నెరవేర్చేందుకు శ్రమిస్తూ  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త విద్యా విధానాన్ని అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తరుణంలో నేటి భారతీయ విద్యావ్యవస్థలో ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. విద్య అంటే కేవలం పుస్తకాల్లోని చదువు మాత్రమేనా? నిజానికి విద్య అనేది విద్యార్థిని విమర్శనాత్మక ఆలోచనాపరుడిగా, సమస్య పరిష్కరించే వ్యక్తిగా, సృజనాత్మక పౌరుడిగా తీర్చిదిద్దాలి. కానీ ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాల ధోరణి ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతోంది.

పాత సిలబస్ - పరిశోధనలకు అవరోధం

భారత్‌లో ఏళ్లుగా వస్తున్న సిలబస్‌నే ఇప్పటికీ చాలా ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధిస్తున్నారు. సిద్ధాంతాలకే(Theory) ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విద్యార్థులకు పరిశ్రమకు అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలు లోపిస్తున్నాయి. గుడ్డిగా బట్టీ పట్టే విధానం వల్ల పిల్లల్లో పరిశోధన, ఆవిష్కరణ, కొత్త ఆలోచనలు చేసే సామర్థ్యం దెబ్బతింటోంది.

కొన్ని ప్రైవేట్ సంస్థలు ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ సంస్థల్లో ఆ మేరకు చర్యలు లేకపోవడంతో మెజారిటీ విద్యార్థులు పాత పద్ధతుల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పరిశోధనలు, ఆవిష్కరణల పరంగా భారత్ భవిష్యత్తులో ప్రపంచ దేశాల కంటే వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.

భవిష్యత్తు కోసం విద్యా విధానం ఎలా ఉండాలి?

భారతదేశం విద్యారంగంలో ప్రపంచంలోనే మెరుగైన స్థాయికి ఎదగాలంటే మన విద్యా విధానాన్ని పూర్తిగా పునర్నిర్మించాలి. జాతీయ విద్యా విధానం (NEP) 2020 లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలి. కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా ప్రయోగశాలలు, ప్రాజెక్టులు, ఫీల్డ్ ట్రిప్‌ల ద్వారా విద్యను బోధించాలి. విభిన్న సబ్జెక్టులను (ఉదా: సైన్స్, ఆర్ట్స్, టెక్నాలజీ) కలిపి బోధించాలి. తద్వారా విద్యార్థికి సమగ్ర దృక్పథం ఏర్పడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా సైన్స్, డిజిటల్ అక్షరాస్యత వంటి ఫ్యూచర్ స్కిల్స్‌ను పాఠ్యాంశాల్లో చేర్చాలి. ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ, ఆధునిక బోధనా పద్ధతులను నేర్పించాలి. బట్టీ పట్టడాన్ని ప్రోత్సహించే పరీక్షలకు బదులుగా విద్యార్థుల సమస్య పరిష్కార సామర్థ్యాన్ని అంచనా వేసే పద్ధతులు ప్రవేశపెట్టాలి.

విద్యా సంస్థల యాజమాన్యాలు చేయాల్సిన తక్షణ చర్యలు

చాలా విద్యా సంస్థలు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఫీజుల వసూళ్లపై (Focus on Fees) అధికంగా దృష్టి సారిస్తున్నాయి. లాభాపేక్ష కంటే విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. ప్రతి పైసా విద్యార్థి అభ్యసన వనరుల కోసం ఖర్చు పెట్టాలి. పాతబడిన తరగతి గదులకు బదులుగా డిజిటల్ లైబ్రరీలు, అత్యాధునిక ప్రయోగశాలలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధనా పరికరాలను అందించాలి. అత్యంత ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను నియమించుకోవాలి. వారికి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి. మంచి జీతాలు ఇవ్వడం ద్వారా బోధనను గౌరవప్రదమైన వృత్తిగా మార్చాలి.

ఫీజుల విషయంలో పారదర్శకత పాటించాలి. పేద విద్యార్థులకు, ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సహాయాన్ని అందించాలి. విద్యను వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలి. విద్యార్థులు సైద్ధాంతిక పరిజ్ఞానంతో(Theoritical Knowledge)పాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ పొందడానికి పరిశ్రమ నిపుణులతో శిక్షణ తరగతులు, ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చేయాలి.

ఇదీ చదవండి: మాజీ ఉద్యోగిపై రూ.2 కోట్లు దావా వేసిన ఇంటెల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement