మాజీ ఉద్యోగిపై రూ.2 కోట్లు దావా వేసిన ఇంటెల్ | Intel Filed $250,000 Lawsuit Against Ex-Engineer Stealing 18000 Confidential Files, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

మాజీ ఉద్యోగిపై రూ.2 కోట్లు దావా వేసిన ఇంటెల్

Nov 11 2025 8:40 AM | Updated on Nov 11 2025 10:59 AM

Intel filed lawsuit against exengineer stealing 18000 confidential files

ఇంటెల్‌ కంపెనీలో పని చేసిన మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జిన్ఫెంగ్ లువోపై కంపెనీ 2,50,000 డాలర్లు (దాదాపు రూ.2 కోట్లు) దావా వేసింది. కంపెనీ నుంచి 18,000 రహస్య ఫైళ్లతోపాటు ‘ఇంటెల్ టాప్ సీక్రెట్’అని లేబుల్ చేసిన డేటాను దొంగిలించినట్లు లువోపై ఆరోపణలు ఉన్నాయి.

ది మెర్క్యురీ న్యూస్ నివేదిక ప్రకారం, లువో 2014లో ఇంటెల్‌లో చేరాడు. కంపెనీ ఆర్థిక సంక్షోభాన్ని నిర్వహించడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి ఇటీవల చాలా మందిని తొలగించింది. అందులో భాగంగా జులై 7, 2024న లువోకు లేఆఫ్‌ ఇచ్చింది. గత రెండేళ్లలో ఇంటెల్ సుమారు 35,000 ఉద్యోగాలను తొలగించింది.

డేటా దొంగతనం

కంపెనీ దావా పత్రాల్లోని వివరాల ప్రకారం, లువోకు లేఆఫ్‌ ప్రకటించిన తర్వాత మొదట తన ఇంటెల్ ల్యాప్‌టాప్ నుంచి ఫైళ్లను ఎక్స్‌టర్నల్‌ డ్రైవ్‌లో కాపీ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఇంటెల్ భద్రతా వ్యవస్థలు ఈ మొదటి ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి. టామ్స్ హార్డ్‌వేర్ నివేదిక ప్రకారం, లువో తన చివరి పని దినానికి మూడు రోజుల ముందు మరోసారి ఫైళ్లను దొంగలించేందుకు ప్రయత్నించాడు. ఈసారి అతను ఫైళ్లను నెట్‌వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ (NAS) పరికరానికి విజయవంతంగా బదిలీ చేశాడు. తర్వాత లువో సంస్థను విడిచిపెట్టే వరకు మరిన్ని అత్యంత గోప్యమైన, కంపెనీ అంతర్గత వివరాలతో కూడిన డేటాను డౌన్‌లోడ్ చేస్తూనే ఉన్నాడు.

ఇంటెల్ భద్రతా వ్యవస్థలు డేటా బదిలీలు పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించాయి. దాంతో కంపెనీ అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది. ఇంటెల్ చెప్పినదాని ప్రకారం, ఉద్యోగం తొలగించిన తర్వాత మూడు నెలలకు పైగా కాల్స్, ఈమెయిల్‌లు, పోస్టల్ లెటర్ల ద్వారా లువోను అనేకసార్లు సంప్రదించడానికి ప్రయత్నించారు. కాని అతను స్పందించలేదు. లువో ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో ఇంటెల్‌ దొంగిలించిన సమాచారాన్ని తిరిగి పొందటానికి 2,50,000 డాలర్ల నష్టపరిహారం కోరడానికి కోర్టులో దావా వేసింది.

గతంలోనూ ఇన్సైడర్ డేటా దొంగతనం కేసులు

లువో ఇంతవరకు ఏ ఆరోపణలకూ సమాధానం ఇవ్వలేదు. ఇంటెల్ అంతర్గత డేటా దొంగతనం కేసును ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల మైక్రోసాఫ్ట్‌లో చేరడానికి ముందు కంపెనీ డేటాను కాపీ చేసినందుకు ఓ మాజీ ఇంటెల్ ఇంజినీర్‌కు 34,000 డాలర్ల జరిమానా విధించారు. ఆ కేసులో తాను దొంగిలించిన సమాచారాన్ని మైక్రోసాఫ్ట్ ప్రయోజనం పొందడానికి ఉపయోగించిందనే ఆరోపణలున్నాయి.

ఇదీ చదవండి: డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement