ఈ నెల 21 వరకు 133 సెంటర్లలో నిర్వహణ
హాజరుకానున్న 2,71,692 మంది
ఇన్ సర్వీస్ టీచర్లు 32వేల మందే దరఖాస్తు
దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే ‘ఇన్ సర్వీస్’ టెట్
ఉపాధ్యాయుల వినతులను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ డిసెంబర్–2025)కు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 133 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకున్నారు.
మంగళవారం సాయంత్రానికి 96.25 శాతం మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే నామినల్ రోల్స్‌లో సరిదిద్దుకునేందుకు ఆయా పరీక్ష సెంటర్ల వద్ద సరైన ధ్రువీకరణపత్రాలు చూపించి మార్చుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు వివరించారు.
టెట్‌కు హాజరుకానున్న 32వేల మంది టీచర్లు
ఉపాధ్యాయ వర్గాల వినతులను చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా టెట్ (డిసెంబర్)–2025లో తొలిసారి ఇన్ సర్వీస్ టీచర్లను కూడా చేర్చింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నిర్వహించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్రం కావడం గమనార్హం. ఈ టెట్‌కు 32 వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు.
వాస్తవానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1.91 లక్షల మంది ఉపాధ్యాయులు ఉండగా, వారిలో 1.62 లక్షల మంది 2012కి ముందు నిర్వహించిన డీఎస్సీల ద్వారా సర్వీసులోకి వచ్చారు. అయినా 32 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, ఇన్ సర్వీస్ టెట్ నిర్వహణపై తమ ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ గత నెలలో ప్రకటించినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ, హడావుడిగా టెట్‌లో ఉపాధ్యాయులను కూడా చేర్చారు. దీనిపై ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడుతున్నారు.
‘ఇన్ సర్వీస్’ టెట్ దేశంలోనే తొలిసారి
విద్యాహక్కు చట్టం–2009లోని నిబంధనల ప్రకారం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు సైతం టెట్ తప్పనిసరి అని ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిని అన్ని రాష్ట్రాలు పాటించాలని ఆదేశించింది. దీనిపై దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి.
అదేవిధంగా విద్యాహక్కు చట్టంలో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రివ్యూ పిటిషన్ వేయలేదు. కనీసం కేంద్రంలోని తమ భాగస్వామ్య ప్రభుత్వానికి సైతం ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.


