
దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రెండు కొత్త బీమా ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. విభిన్న వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి, ఆర్థిక రక్షణ, పొదుపు ప్రయోజనాలను అందించడానికి ‘ఎల్ఐసీ జన్ సురక్ష’, ‘ఎల్ఐసీ బీమా లక్ష్మి’ అనే పేర్లతో వీటిని రూపొందించింది.
ఎల్ఐసీ జన్ సురక్ష (LIC Jan Suraksha), ఎల్ఐసీ బీమా లక్ష్మి (LIC Bima Lakshmi) అక్టోబర్ 15 నుంచి ఈ రెండు కొత్త పాలసీలు అందుబాటులో ఉంటాయని, కొత్త నెక్స్ట్ జెన్ జీఎస్టీ విధానంలో ఎల్ఐసీ విడుదల చేసిన మొదటి ఉత్పత్తులు ఇవేనని బీమా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎల్ఐసీ జన్ సురక్ష
ఎల్ఐసీ జన్ సురక్ష ప్లాన్ ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం రూపొందించిన తక్కువ ఖర్చుతో కూడిన బీమా పథకం. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, అంటే ఇది మార్కెట్ లేదా బోనస్ లతో లింక్ చేయబడదు.
🔹 ముఖ్య లక్షణాలు
రకం: నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్
ప్రత్యేకత: తక్కువ ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి అనుకూలం
బీమా మొత్తం: కనీసం రూ.1,00,000, గరిష్టంగా రూ.2,00,000
పాలసీ కాలం: 12 నుంచి 20 సంవత్సరాలు
ప్రీమియం చెల్లింపు కాలం: మొత్తం పాలసీ కాలంలో 5 సంవత్సరాలు తీసివేయగా వచ్చే కాలం
అర్హత:
వయస్సు: 18 నుండి 55 ఏళ్లు
ఆరోగ్యం: పాలసీదారుకు మంచి ఆరోగ్యస్థితి ఉండాలి. వైద్య చికిత్సలు తీసుకుంటూ ఉండరాదు.
అదనపు ప్రయోజనాలు:
3 సంవత్సరాల ప్రీమియం చెల్లింపుల తర్వాత ఆటో కవర్
1 సంవత్సరం తర్వాత పాలసీ రుణం
గ్యారెంటీడ్ ఎడిషన్లు
ఎల్ఐసీ బీమా లక్ష్మి
ఎల్ఐసీ బీమా లక్ష్మి అనేది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జీవిత బీమా, పొదుపు పథకం. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ స్కీం, ఇది జీవిత బీమా, కాలానుగుణ మనీబ్యాక్ ఎంపికలు రెండింటినీ అందిస్తుంది.
🔹 ముఖ్య లక్షణాలు
రకం: నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ మనీబ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్
ప్రత్యేకత: మహిళల కోసం ప్రత్యేకం
బీమా మొత్తం: కనీసం రూ. 2,00,000, గరిష్ట పరిమితి లేదు (అండర్‌రైటింగ్ ఆధారంగా)
పాలసీ కాలం: 25 సంవత్సరాలు
ప్రీమియం చెల్లింపు కాలం: 7 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది.
అర్హత:
వయస్సు: 18–50 సంవత్సరాల మధ్య
అదనపు ప్రయోజనాలు
గ్యారెంటీడ్ వార్షిక జోడింపులు
సర్వైవల్ బెనిఫిట్లు నచ్చినట్లు ఎంచుకునే అవకాశం
సర్వైవల్ బెనిఫిట్లు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు.
మెచ్యూరిటీ / డెత్ బెనిఫిట్ వాయిదాలలో తీసుకునే అవకాశం
ఆటో కవర్ సౌలభ్యం (3 సంవత్సరాల తర్వాత)
అధిక బీమా మొత్తానికి ప్రోత్సాహకాలు
ఇదీ చదవండి: దీపావళి ఇన్సూరెన్స్ రూ.5 లకే..