హైరింగ్‌ ‘పండగ’! | Key Findings from Adecco 2025 Jobs Report | Sakshi
Sakshi News home page

హైరింగ్‌ ‘పండగ’!

Nov 12 2025 8:27 AM | Updated on Nov 12 2025 8:27 AM

Key Findings from Adecco 2025 Jobs Report

ఈ సీజన్‌లో 2.16 లక్షల గిగ్, తాత్కాలిక జాబ్స్‌

గతేడాదితో పోలిస్తే 25 శాతం జంప్‌..

రిటైల్, ఈ–కామర్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, లాజిస్టిక్స్, ఆతిథ్యంలో జోరు

అడెకో నివేదికలో వెల్లడి 

ఈ ఏడాది పండగ సీజన్‌లో నియమాకల దుమ్మురేగిపోయింది. సానుకూల కన్జూమర్‌ సెంటిమెంట్‌కు తోడు ఆకర్షణీయమైన ప్రమోషన్లు, భారీగా విస్తరణ దన్నుతో 2025 ఆగస్ట్‌–అక్టోబర్‌ మధ్య భారీగా ఉద్యోగ కల్పన జరిగిందని హైరింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ అడెకో ఇండియా తాజా నివేదికలో పేర్కొంది. గతేడాది పండగ సీజన్‌తో పోలిస్తే మొత్తంమీద హైరింగ్‌ 17 శాతం పెరిగిందని, గిగ్, తాత్కాలిక జాబ్స్‌ 25 శాతం ఎగబాకినట్లు వెల్లడించింది. 2025 పండగ సీజన్‌ మూడు నెలల్లో 2.16 లక్షల గిగ్, తాత్కాలిక ఉద్యోగాలు లభించినట్లు అంచనా వేసింది. కాగా, తాత్కాలిక జాబ్స్‌ 37 శాతం వృద్ధి చెందగా, గిగ్‌ వర్కర్ల నియమాకాలు 15–20 శాతం పుంజుకున్నాయని నివేదిక తెలిపింది.

‘ఈ ఏడాది పండగ హైరింగ్‌ను గమనిస్తే, కంపెనీల ఆర్థికపరమైన విశ్వాశం, గిగ్‌ ఎకానమీ అంతకంతకూ బలోపేతం అవుతోందనే దాన్ని ప్రతిబింబిస్తోంది. నియామకాల సంఖ్య, వేతన చెల్లింపులు గత మూడేళ్ల స్థాయిని అధిగమించాయి. తద్వారా కోవిడ్‌ తదనంతర సాధారణ స్థాయి తర్వాత అత్యంత పటిష్టమైన ఏడాదిగా 2025 నిలిచింది. ముఖ్యంగా రిటైల్, కస్టమర్‌ సపోర్ట్, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లలో భారీగా నియామకాలు జరిగాయి’ అని అడెకో ఇండియా డైరెక్టర్, జనరల్‌ స్టాఫింగ్‌ హెడ్‌ దీపేష్‌ గుప్తా పేర్కొన్నారు. నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ...

  • రిటైల్, ఈ–కామర్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగాల్లో తాత్కాలిక ఉద్యోగాలు వెల్లువెత్తాయి.

  • ప్రారంభ స్థాయి కొలువుల్లో వేతనాలు 12–15 శాతం పెరగ్గా, అనుభవంతో కూడిన విధుల్లో 18–22 శాతం వేతన వృద్ధి నమోదైంది.

  • ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌తో పాటు 2026 మార్చి వరకు హైరింగ్‌ జోరు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా హాస్పిటాలిటీ, ట్రావెల్, లాజిస్టిక్స్, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లో డిమాండ్‌ జోరుగా ఉంది.

  • ఈ కాలంలో హైరింగ్‌ వార్షికంగా 18–20 శాతం పెరగవచ్చని అంచనా. ఇందులో సగం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నగరాల నుంచే జతయ్యే అవకాశం ఉంది.

  • మొత్తం హైరింగ్‌లో దాదాపు 75–80 శాతం ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో సిటీల నుంచే నమోదైంది. 

అయితే, ద్వితీయ శ్రేణి, వర్ధమాన నగరాల్లో గతేడాదితో పోలిస్తే ఉద్యోగాల డిమాండ్‌ 21–25 శాతం ఎగబాకింది. లక్నో, జైపూర్, కోయంబత్తూరు, భువనేశ్వర్, నాగపూర్, మైసూరు వంటి నగరాలు... మెట్రోలను మించి (14 శాతం వృద్ధి) 21 శాతం పెరుగుదలను సాధించాయి. మరోపక్క, కాన్పూర్, కొచ్చి, విజయవాడ, వారణాసితో సహా పలు కొత్త మార్కెట్లు తాత్కాలిక ఉద్యోగాలకు కేంద్రాలుగా ఆవిర్భవించాయి.

  • రిటైల్, ఈ–కామర్స్‌ రంగాల్లో 28 శాతం హైరింగ్‌ పెరిగింది. లాజిస్టిక్స్, లాస్ట్‌–మైల్‌ డెలివరీ తదితర విధుల్లో తాత్కాలిక ఉద్యోగాలకు సంబంధించి 35–40 శాతం వృద్ధి నమోదైంది.

  • బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో పండగ నియామకాలు 30 శాతం ఎగబాకాయి. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఫీల్డ్‌ సేల్స్, క్రెడిట్‌ కార్డ్, పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పీఓఎస్‌) కొలువులకు ఫుల్‌ జోష్‌ నెలకొంది.

  • హాస్పిటాలిటీ, ట్రావెల్‌ రంగం కూడా బాగానే పుంజుకుంది. ఫ్రంట్‌–ఆఫీస్, ఈవెంట్, ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ సిబ్బందికి డిమాండ్‌ 25 శాతం మేర పెరిగింది. పండగ ప్రయాణాలకు తోడు, పెళ్లిళ్ల సీజన్‌ బుకింగ్స్‌ ఇందుకు దోహదం చేశాయి.

ఇదీ చదవండి: బంగారం మాయలో పడొద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement