బంగారం మాయలో పడొద్దు! | How to Invest in Gold Safely: Benefits of Gold ETFs Over Physical Gold | Sakshi
Sakshi News home page

బంగారం మాయలో పడొద్దు!

Nov 11 2025 2:15 PM | Updated on Nov 11 2025 2:33 PM

Investing Gold All glitters is not gold Hidden risks benefits gold ETFs

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ప్రస్తుతం చాలా కుటుంబాల్లో బంగారంపై చర్చ జరుగుతుంది. పెళ్లి కుటుంబాల్లో బంగారం కొనుగోలు అనివార్యం. అయితే పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు కూడా ఇదే అదనుగా పుత్తడిని కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం భయాల మధ్య బంగారం ధరలు ఇటీవల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ సంపదను కాపాడుకోవడానికి, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి చాలా మంది పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి సారిస్తున్నారు. అయితే బంగారంలో పెట్టుబడి అంటే నేరుగా ఆభరణాలు లేదా కాయిన్స్‌ కొనుగోలు చేయాలని కొ​ందరు భావిస్తున్నారు. కానీ, కేవలం ‘బంగారం’ అనే భావనతో భౌతిక రూపంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించని నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. మరి.. ఈ మెరిసే లోహంలో సురక్షితంగా, లాభదాయకంగా పెట్టుబడి పెట్టాలంటే సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.

భౌతిక బంగారం కొనుగోలుతో..

  • బంగారం కొనుగోలు అనేది తరతరాలుగా వస్తున్న ఒక అలవాటు. అయితే, దీన్ని ఒక పెట్టుబడి సాధనంగా చూసినప్పుడు నేరుగా బంగారం కొనుగోలు చేయడం (ఫిజికల్ గోల్డ్) అనేక ప్రతికూలతలను కలిగి ఉంటుంది. ఆభరణాలు కొన్నప్పుడు బంగారం అసలు ధరతో పాటు అధికంగా 8% నుంచి 30% వరకు తయారీ ఛార్జీలు, తరుగు రూపంలో కొంత చెల్లించాల్సి వస్తుంది. ఈ ఖర్చు పెట్టబడుల నుంచి లాభాన్ని తగ్గిస్తుంది.

  • బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు దాని స్వచ్ఛత (క్యారెట్) విషయంలో అనుమానాలు, మోసాలు జరిగే అవకాశం ఉంది. హాల్‌మార్క్ ఉన్నప్పటికీ చిన్న దుకాణాల్లో నాణ్యతను తనిఖీ చేయడం కష్టం. భౌతిక బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే దొంగతనం జరిగే ప్రమాదం ఉంది. బ్యాంక్ లాకర్లలో ఉంచినా అద్దె, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇది పెట్టుబడిపై రాబడిని తగ్గిస్తుంది.

  • అత్యవసర పరిస్థితుల్లో బంగారాన్ని త్వరగా సరైన ధరకు అమ్మడం కష్టం కావచ్చు. కొన్నిసార్లు కొనుగోలు చేసిన ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుంది. కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది పెట్టుబడిదారునికి అదనపు భారం. బంగారు ఆభరణాలు ఖర్చు లేదా అలంకారం కిందకు వస్తాయి తప్ప పూర్తిస్థాయి పెట్టుబడి కిందకు రావని గమనించాలి.

గోల్డ్ ఈటీఎఫ్‌లు

బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా సులభంగా, పారదర్శకంగా ఉండే మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (Gold ETFs). గోల్డ్ ఈటీఎఫ్‌లు అంటే ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న గోల్డ్ యూనిట్లు అని అర్థం. ఇవి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లేదా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో షేర్ల వలె ట్రేడ్ అవుతాయి. ఒక గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ సాధారణంగా ఒక గ్రాము బంగారానికి సమానం.

గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఎలా ఇన్వెస్ట్‌ చేయాలి?

  • ముందుగా ఏదైనా బ్రోకరేజ్ సంస్థ వద్ద డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాను తెరవాలి. ఇది షేర్లు కొనుగోలు చేయడానికి అవసరం.

  • వివిధ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMC) అందించే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో (ఉదా: నిప్పన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్..) ఒకదాన్ని ఎంచుకోవాలి.

  • ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో మీకు కావలసిన గోల్డ్ ఈటీఎఫ్ పేరును ఎంటర్ చేసి షేర్లను కొనుగోలు చేసినట్లే యూనిట్లను కొనుగోలు చేయవచ్చు.

  • ఒకేసారి పెద్ద మొత్తంలో లేదా క్రమంగా చిన్న మొత్తాల్లో (సిప్ మాదిరిగా) కొనుగోలు చేయవచ్చు.

గోల్డ్ ఈటీఎఫ్‌ల వల్ల ప్రయోజనాలు

గోల్డ్ ఈటీఎఫ్‌లు అనేక రకాల ప్రయోజనాలను అందించి, భౌతిక బంగారంపై మెరుగైన పెట్టుబడి సాధనంగా నిలుస్తాయి. ప్రతి ఈటీఎఫ్ యూనిట్ 99.5% స్వచ్ఛత కలిగిన భౌతిక బంగారం కలిగి ఉంటుంది. నాణ్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందులో తయారీ ఛార్జీలు, తరుగు వంటివి ఉండవు. కేవలం కొద్దిపాటి బ్రోకరేజ్, ఫండ్ నిర్వహణ ఛార్జీలు (సాధారణంగా 0.5% లోపు) మాత్రమే ఉంటాయి. ఇది లాభాలను పెంచుతుంది.

స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రోజులో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. తక్షణమే నగదుగా మార్చుకోవచ్చు. ఈటీఎఫ్‌లు ఎలక్ట్రానిక్ రూపంలో డీమ్యాట్ ఖాతాలో నిల్వ చేయబడతాయి కాబట్టి, దొంగతనం అయ్యే ప్రమాదం లేదు. లాకర్ ఖర్చులు ఉండవు. కేవలం ఒక యూనిట్ (సుమారు ఒక గ్రాము బంగారానికి సమానం) నుంచే పెట్టుబడి ప్రారంభించవచ్చు. దీనివల్ల సాధారణ మధ్యతరగతి పెట్టుబడిదారులు కూడా సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు.

ఇదీ చదవండి: ఉద్యోగంతో ఊడిగం చేయాల్సిందేనా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement