రైలు ఆలస్యమైతే.. ప్రయాణికులకు ఫ్రీ ఫుడ్! | IRCTC Policy Free Meals for Passengers on Delayed Trains | Sakshi
Sakshi News home page

రైలు ఆలస్యమైతే.. ప్రయాణికులకు ఫ్రీ ఫుడ్!

Jun 17 2026 7:07 PM | Updated on Jun 17 2026 7:58 PM

IRCTC Policy Free Meals for Passengers on Delayed Trains

రైలు ప్రయాణాలు ఆలస్యమైతే ప్రయాణికులకు అసహనం కలుగుతుంది. గంటల తరబడి స్టేషన్‌లో వేచి ఉండడం, అనౌన్స్‌మెంట్‌లు వినడం, టైమ్ చూసుకుంటూ ఆందోళన చెందడం చాలా మందికి సాధారణ అనుభవమే. ఇలాంటి పరిస్థితుల్లో భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికులకు ఊరట కలిగించే ఒక సదుపాయాన్ని అందిస్తోంది.

నియమాల ప్రకారం.. రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు నిర్ణీత సమయానికి.. రెండు గంటలకు పైగా ఆలస్యమైతే ప్రయాణికులకు ఉచిత భోజనం అందించడం జరుగుతుంది. ఉదయం అయితే బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం అయితే లంచ్, సాయంత్రం లేదా రాత్రి అయితే డిన్నర్ అందిస్తారు.

ఫుడ్ మెనూ ప్రకారం..

టీ / కాఫీ
➤టీ లేదా కాఫీతో పాటు బిస్కెట్లు
➤మిల్క్ క్రీమర్, షుగర్ లేదా షుగర్-ఫ్రీ సాచెట్లు

బ్రేక్‌ఫాస్ట్ / సాయంత్రం స్నాక్స్
➤4 బ్రెడ్ స్లైసులు (వైట్ లేదా బ్రౌన్)
➤బటర్
➤ఫ్రూట్ జ్యూస్ లేదా డ్రింక్
➤టీ లేదా కాఫీ

లంచ్ / డిన్నర్
➤అన్నం + పప్పు (దాల్)
➤రాజ్మా లేదా చోలే
➤పచ్చడి ప్యాకెట్
➤లేదా 7 పూరీలు + మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ
➤ఉప్పు, మిరియాల ప్యాకెట్లు కూడా ఉంటాయి

ఇది ప్రయాణికులు కొంత సౌకర్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా.. రైలు మూడు గంటలకు పైగా ఆలస్యమైతే ప్రయాణికులు తమ టికెట్‌ను రద్దు చేసుకుని పూర్తి రీఫండ్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ రీఫండ్ ప్రక్రియను కూడా ఆన్‌లైన్ బుకింగ్ చేసిన అదే ప్లాట్‌ఫార్మ్ ద్వారా సులభంగా పొందవచ్చు.

దీర్ఘకాలిక ఆలస్యాల సమయంలో వెయిటింగ్ హాల్స్‌ను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. అలాగే కొన్ని స్టేషన్లలో ఫుడ్ కౌంటర్లు కూడా ఎక్కువ సమయం వరకు తెరిచి ఉంటాయి, తద్వారా ప్రయాణికులకు అవసరమైన ఆహారం అందుబాటులో ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement