
కెరీర్‌లో గ్యాప్ మహిళలకు దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చక్కని అవకాశం కల్పిస్తోంది. వృత్తి జీవితానికి విరామం ఇచ్చి మళ్లీ ఉద్యోగ ప్రపంచంలో అడుగు పెట్టాలనుకుంటున్న మహిళల కోసం రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ అనే కొత్త రిఫరల్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. విజయవంతమైన రిఫరల్స్‌కు రూ .50,000 వరకు రివార్డులను కూడా అందించనున్నట్లు కంపెనీ ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్ పంపింది.
అర్హతలు ఇవే..
ఈ ప్రోగ్రామ్ కు అర్హత పొందడానికి, అభ్యర్థులు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. కనీసం ఆరు నెలల పాటు నిరంతర కెరీర్ గ్యాప్ ఉండాలి. అర్హులైనవారిని వివిధ టెక్నాలజీల్లో డెవలపర్లు, టెక్ లీడ్‌లు, మేనేజర్లుగా నియమించుకునేందుకు ప్రయత్నిస్తోందని, దీని గురించి తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ ఒక నివేదిక పేర్కొంది.
రెఫర్ చేసినవారికి రివార్డులు
ఈఎస్‌జీ విజన్ 2030లో భాగంగా 2030 నాటికి 45 శాతం మహిళా ప్రాతినిధ్యాన్ని సాధించాలని ఇన్ఫోసిస్ లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ఈఎస్‌జీ నివేదిక ప్రకారం.. కంపెనీలో ప్రస్తుతం సుమారు 3,23,000 మంది ఉద్యోగులలో మహిళలు 39% ఉన్నారు. దీంతో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగా కంపెనీ ఈ రిఫరల్ ప్రోత్సాహకాలను అందిస్తోంది. జాబ్ లెవల్ 3 (JL3) లో విజయవంతమైన నియామకాలకు రూ .10,000, జాబ్ లెవల్ 4కు రూ .25,000, జాబ్ లెవల్ 5కు రూ .35,000, జాబ్ లెవల్ 6 రెఫరల్స్‌కు రూ .50,000 రివార్డులను ఇన్ఫోసిస్ అందించనుంది.
ఇదీ చదవండి: ‘టీసీఎస్‌లో బలవంతంగా రాజీనామా చేయమన్నారు’