
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ చుట్టూ రోజుకో వివాదం రేగుతోంది. భారీగా లేఆఫ్‌ల ప్రకటనతోపాటు ఆ సంస్థలో బలవంతంగా రాజీనామాలు, ఉద్యోగ విరమణలు చేయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మరో ఉద్యోగి తనను రాజీనామా చేయాలని బలవంతం చేశారని ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు ప్రొఫెషనల్ సామాజిక ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. 3,000 కు పైగా అప్ ఓట్లు, వందలాది కామెంట్లు వచ్చాయి. ఇది దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థలలో ఒకటైన టీసీఎస్‌లో విషపూరిత పద్ధతులపై విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది.
తనను టీసీఎస్‌లో జూనియర్ టెక్ ఉద్యోగిగా చెప్పుకొన్న రెడిటర్ అదే తన మొదటి ఉద్యోగంగా పేర్కొన్నారు. మూడు రోజుల ముందు మీటింగ్ హాల్‌కు పిలిచి అక్కడ తనను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని హెచ్‌ఆర్ ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. అయితే తాను రాజీనామా చేయడానికి నిరాకరించానని, అందుకు తనను టర్మినేట్ చేసి వ్యతిరేక రివ్వూలు ఇస్తానని బెదిరించారని, అయినప్పటికీ తాను రాజీనామా చేయను.. మీకు నచ్చినట్లు చేసుకోండని చెప్పానని రాసుకొచ్చారు.
అంతేకాక సంస్థలో పని వాతావరణం గురించి కూడా పలు ఆరోపణలు చేశారు. జీతం చాలా తక్కువే అయినా దాని వర్క్ కల్చర్, ఉద్యోగ భద్రత కారణంగా తాను టీసీఎస్ లో చేరానని, కానీ దానికి ఇప్పుడు చింతిస్తున్నానని వాపోయారు. ‘రతన్ టాటా తరువాత, ఈ కంపెనీ గందరగోళానికి గురైంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.