టాటా ట్రస్ట్‌లో ఆధిపత్య పోరు ముగిసినట్లేనా? | why Mehli Mistry resigned three key Tata Trusts | Sakshi
Sakshi News home page

టాటా ట్రస్ట్‌లో ఆధిపత్య పోరు ముగిసినట్లేనా?

Nov 5 2025 9:14 AM | Updated on Nov 5 2025 9:52 AM

why Mehli Mistry resigned three key Tata Trusts

దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం తరువాత టాటా ట్రస్ట్‌లో నెలకొన్న ఆధిపత్య పోరు, అంతర్గత అనిశ్చితికి మెహ్లీ మిస్త్రీ రాజీనామాతో తెరపడింది. టాటా గ్రూప్‌నకు ప్రధాన హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో 66% వాటాను నియంత్రించే సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, బాయి హీరాబాయి జె.ఎన్. టాటా నవ్సారి చారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్ ట్రస్ట్‌కు ట్రస్టీగా ఉన్న మిస్త్రీ నవంబర్‌ 4న అధికారికంగా వైదొలిగారు. తన ట్రస్టీషిప్ చుట్టూ నెలకొన్న వివాదం నుంచి ట్రస్టులు ముందుకు సాగడానికి, సంస్థ వారసత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిస్త్రీ రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఆధిపత్య పోరు.. అనిశ్చితి

రతన్ టాటా (అక్టోబర్ 9, 2024న మరణించారు) మరణానంతరం ట్రస్ట్స్‌లో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోవడం కొరవడింది. రతన్ టాటా హయాంలో కీలక నిర్ణయాలు ఎప్పుడూ ఏకగ్రీవంగా తీసుకునేవారు. ఓటింగ్‌కు అవకాశం ఉండేది కాదు. ఆయన మరణానంతరం ట్రస్టీల మధ్య విభేదాలు తలెత్తి కీలక నిర్ణయాల విషయంలో మెజారిటీ ఓటు అవసరం అయింది. ఈ క్రమంలో మెహ్లీ మిస్త్రీని ట్రస్టీగా తిరిగి నియమించడానికి అందరి అంగీకారం అవసరం అయింది. 2024 అక్టోబర్ 17న బోర్డు తన జీవితకాల ట్రస్టీపై తీర్మానం ఆమోదించినప్పటికీ మిస్త్రీని తిరిగి నియమించాలనే ప్రతిపాదనను తరువాత నిలిపేశారు. ఇది ట్రస్టీల మధ్య సమన్వయం లోపించిందనడానికి కారణమైంది.

రతన్ టాటాకు అత్యంత నమ్మకస్థుడు

మెహ్లీ మిస్త్రీ రతన్ టాటాకు అత్యంత నమ్మకస్థుల్లో ఒకరు. షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌తో సంబంధం ఉన్న వ్యక్తి (సైరస్ మిస్త్రీకి బంధువు). ఈయన టాటా ట్రస్టుల్లో పారదర్శకతను కాపాడాలని వాదించేవారు. రతన్ టాటా మరణానంతరం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నోయెల్ టాటా(టాటా ట్రస్ట్స్ చైర్మన్, రతన్ టాటా సోదరుడు) నాయకత్వంలో ట్రస్టీలు తమ ప్రభావాన్ని చూపలేకపోతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.

మిస్త్రీ పునర్నియామకాన్ని వ్యతిరేకించిన వర్గంలో నోయెల్ టాటా, వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ వంటి ట్రస్టీలు ఉన్నారు. మిస్త్రీకి మద్దతు ఇచ్చిన వర్గంలో ప్రమిత్ ఝవేరి, డారియస్ ఖంబాట, హెచ్.సి.జహంగీర్ వంటి ట్రస్టీలు ఉన్నారు.

ఆధిపత్య పోరుకు కారణాలు

రతన్ టాటా ఉన్నంత కాలం ఆయన వ్యక్తిగత ప్రభావం, మార్గదర్శకత్వం కారణంగా ట్రస్ట్స్‌లో విభేదాలు బహిరంగంగా కనిపించలేదు. ఆయన మరణానంతరం నాయకత్వంలో అస్థిరత నెలకొంది. ట్రస్ట్స్‌ తరఫున టాటా సన్స్‌ బోర్డులో నామినీ డైరెక్టర్ల నియామకం వంటి కీలక అంశాల్లో ట్రస్టీల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తాయి. టాటా ట్రస్ట్స్‌కు టాటా సన్స్‌లో ఉన్న మెజారిటీ వాటాతో గ్రూప్‌పై నిర్ణయాత్మక శక్తి ఉంది. ఈ కారణంగా ట్రస్ట్స్‌లో పట్టు సాధించడం అనేది టాటా సామ్రాజ్యం భవిష్యత్తుపై నియంత్రణ సాధించడంతో సమానం.

వ్యూహాత్మక విరమణ

మెహ్లీ మిస్త్రీ తన పదవీకాలం ముగిసిన (అక్టోబర్ 27, 2025) కొద్ది రోజులకే రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ట్రస్టీలకు రాసిన లేఖలో మిస్త్రీ.. ‘విషయాలను వేగవంతం చేయడం ట్రస్టుల ప్రతిష్టకు కోలుకోలేని హాని కలిగిస్తుంది. ట్రస్ట్‌లో ఊహాగానాలకు ముగింపు పలకడానికి, సంస్థ సమగ్రతను కాపాడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. సంస్థ కంటే ఎవరూ గొప్పవారు కాదు’ అని రాశారు.

ఇదీ చదవండి: గోపీచంద్‌ హిందూజా కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement