
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడిపోతాయో చెప్పలేం. అయితే ఆ ఏఐ సాధనానికి శిక్షణ ఇచ్చేవాళ్ల ఉద్యోగాలే పోవడం బాధాకరం. బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్స్‌ఏఐ (xAI).. తన డేటా అనోటేషన్ బృందం నుండి సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది. వీరంతా సంస్థ జనరేటివ్ ఏఐ చాట్ బాట్ ‘గ్రోక్’కు శిక్షణ ఇచ్చే సిబ్బంది కావడం గమనార్హం.
ఇదీ కారణం
నివేదిక ప్రకారం.. ఉద్యోగుల తొలగింపులకు కారణం సంస్థ దృష్టి మారడం. ఎక్స్‌ఏఐ సాధారణ ఏఐ ట్యూటర్లను అభివృద్ధి చేయడంపై దృష్టిని తగ్గించి స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లపై వనరులను కేంద్రీకరిస్తుందంటూ సిబ్బందికి పంపిన ఈమెయిల్ లో కంపెనీ తెలిపింది. "మా హ్యూమన్ డేటా ప్రయత్నాలను క్షుణ్ణంగా సమీక్షించిన తరువాత, మా స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్ల విస్తరణ, ప్రాధాన్యతను వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నాం. అదే సమయంలో సాధారణ ఏఐ ట్యూటర్ ఉద్యోలపై మా దృష్టిని తగ్గించాం. "ఫోకస్ లో ఈ మార్పులో భాగంగా, మాకు ఇకపై చాలా సాధారణ ఏఐ ట్యూటర్ ఉద్యోగులు అవసరం లేదు.. ఎక్స్‌ఏఐతో మీ ఉద్యోగం ముగుస్తుంది" అని పేర్కొంది.
ఉద్యోగులకు సిస్టమ్ యాక్సెస్ రద్దు చేస్తామని చెప్పిన కంపెనీ వారి ఒప్పందాలు ముగిసే వరకు లేదా నవంబర్ 30 వరకు జీతాలు చెల్లింపు కొనసాగుతుందని వివరించింది. వీడియో గేమ్స్, వెబ్ డిజైన్, డేటా సైన్స్, మెడిసిన్, స్టెమ్ వంటి రంగాలలో స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లపై పెట్టుబడులను పెంచుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసినట్లు తెలిసింది. అందుకుఅనుగుణంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను పెంచుకోనున్నట్లు ఇటీవలే ఎక్స్‌ఏఐ ప్రకటించింది.
ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాలకు ఓకే కానీ.. టెకీల ఆలోచనలు