
చాలా మటుకు టెక్నాలజీ నిపుణులు కొత్త అవకాశాలపై ఆసక్తిగా ఉన్నప్పటికీ .. ఉద్యోగాల ఎంపిక విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. తమ లక్ష్యాలు, కెరియర్ పురోగతి, శారీరక .. మానసిక ఆరోగ్ లాంటి అంశాలకు సదరు ఉద్యోగం ఎంత వరకు దోహదపడుతుందనేది బేరీజు వేసుకుంటున్నారు. దేశీ టెకీలపై గ్లోబల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ మైఖేల్ పేజ్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం అంతర్జాతీయంగా అత్యంత ఆత్మవిశ్వాసంతో, ఉద్యోగాల ఎంపికలో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్న టెక్ నిపుణుల్లో భారతీయ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన సర్వేలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 5,000 మంది ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. భారతీయ ప్రొఫెషనల్స్‌లో 94 శాతం మంది కొత్త అవకాశాలపై ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.
మరిన్ని విశేషాలు..
→ అంతర్జాతీయంగా అవకాశాలను పరిశీలించాలనే ఆలోచనే తాము ఉద్యోగాలు మారడానికి ప్రేరణగా ఉంటుందని 39 శాతం మంది టెకీలు తెలిపారు. మెరుగైన జీతం, వృద్ధి అవకాశాలు కారణమని 31 శాతం మంది చెప్పారు.
→ వెసులుబాటు విషయంలో టెక్ నిపుణులు ఏమాత్రం రాజీపడటం లేదు. 26 శాతం మంది సరళతరమైన పని విధానాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఒకవేళ మాటిమాటికీ ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని 45 శాతం మంది తెలిపారు.
→ 23 శాతం మంది తమ ప్రస్తుత వేతనాలపై అసంతృప్తిగా ఉన్నారు. 20 శాతం మంది చురుగ్గా శిక్షణ పొందుతున్నారు. అర్థవంతమైన పని, కెరియర్లో వృద్ధి అవకాశాలకు ప్రాధాన్యతనివ్వడానికి మొగ్గు చూపుతున్నారు.
→ టెక్ నిపుణులు, ఉద్యోగాలను ఎంచుకోవడంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో కంపెనీలు కూడా కేవలం మెరుగైన వేతనాన్ని ఇవ్వజూపడానికే పరిమితం కాకుండా వెసులుబాటు, వృద్ధి అవకాశా ల్లాంటివి కూడా ఆఫర్ చేయాల్సి వస్తోంది.
→ హైబ్రిడ్ పని, ఏఐ సన్నద్ధతపై పెట్టుబడులు, నమ్మకం..పారదర్శకతకు పెద్దపీట వేసే సంస్కృతిని పెంపొందించే కంపెనీలు టాప్ ప్రతిభావంతులను ఆకర్షించడంతో పాటు పోటీ మార్కెట్లోను గట్టిగా నిలబడటానికి వీలుంటుంది.