కేంద్ర ప్రభుత్వం రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలకమైన ఆర్థిక సంస్కరణను చట్టరూపంలోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల జారీ చేసిన ఒక అత్యవసర ఆర్డినెన్స్ స్థానంలో.. ‘ఆదాయ పన్ను (సవరణ) బిల్లు, 2026’ను ప్రవేశపెట్టేందుకు ముసాయిదాను సిద్ధం చేసింది. జులై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సెషన్‌లో ఈ బిల్లుకు ప్రాధాన్యత లభించనుంది.
ఆర్డినెన్స్ స్థానంలో కొత్త చట్టం
ఈ ప్రతిపాదిత చట్టం ద్వారా గత నెల (జూన్ 5, 2026) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆదాయ పన్ను (సవరణ) ఆర్డినెన్స్, 2026’ను భర్తీ చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో తక్షణ నివారణ చర్యల కోసమై రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 ప్రకారం లభించిన ప్రత్యేక అధికారాల ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులతో ఈ ఆర్డినెన్స్‌ను అమల్లోకి తెచ్చారు. ఇది ఏప్రిల్ 1, 2026 నుంచి పాత తేదీతో వర్తిస్తుంది.
విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను మినహాయింపు
ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.. భారత ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం. గరిష్ట భద్రత గల ప్రభుత్వ బాండ్ల ద్వారా విదేశీ ఇన్వెస్టర్లకు లభించే వడ్డీ ఆదాయం, వాటి విక్రయాల ద్వారా వచ్చే మూలధన లాభాలపై ఆదాయ పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వడం ఈ కొత్త బిల్లులోని ప్రధానాంశం.
ఎందుకు ఈ వ్యూహాత్మక అడుగు?
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ముడిచమురు ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులు, ప్రపంచ మార్కెట్ల ఒడిదొడుకుల నేపథ్యంలో భారత్ ఈ ముందస్తు చర్యలు చేపట్టింది. దీని ద్వారా ఒరగూరే ప్రయోజనాలు..
భారత సార్వభౌమ రుణ మార్కెట్‌ను (సావరిన్ డెట్ మార్కెట్) అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తృతం చేయడం.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దీర్ఘకాలిక గ్లోబల్ పెట్టుబడులను దేశంలోకి క్రమబద్ధంగా ఆకర్షించడం.
విదేశీ నిధుల రాక ద్వారా అంతర్జాతీయ ఒత్తిళ్ల నుంచి రూపాయి విలువను కాపాడుకోవడం, దేశీయ ఆర్థిక మార్కెట్‌లో లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) పెంచడం.
భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ బాండ్ సూచీలలో చేర్చిన తరుణంలో ఈ పన్ను రాయితీలు గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఒక సానుకూల సంకేతాన్ని పంపుతాయని నిపుణులు నమ్ముతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను తట్టుకుంటూనే దేశీయంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపార సౌలభ్యం)ను పెంపొందించడానికి ఇదొక ముందడుగని చెబుతున్నారు.
ఇదీ చదవండి: వాడకుండా ఉన్న క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేస్తున్నారా?


