
దీనికి ప్రభుత్వం చెక్ పెట్టాలి
జీటీఆర్‌ఐ సూచన
న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు తయారీ వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో తీసుకొచ్చిన డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ (డీఎఫ్‌ఐఏ) పథకం (పన్ను రహిత దిగుమతి ధ్రువీకరణ పథకం) దుర్వినియోగం అవుతున్నట్టు ప్రైవేటు పరిశోధన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) వెలుగులోకి తెచి్చంది. దోపిడీకి ఇది లైసెన్స్‌గా మారినట్టు ఆరోపించింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని దీనికి చెక్ పెట్టాలని సూచించింది. లేదంటే ఎగుమతుల ప్రోత్సాహక విధానంపై ఉన్న నమ్మ కం పోతుందని, నిజాయితీ పరులైన ఎగుమతిదారులు వ్యాపారానికి దూ రం కావాల్సి వస్తుందని ఆందోళ న వ్యక్తం చేసింది.
గత ఐదేళ్లలో కంపెనీలకు ఈ పథకం కింద జారీ చేసిన లైసెన్స్‌లపై ఫోరెన్సిక్ ఆడిట్ అవసరమని పేర్కొంది. సుంకాల్లేని మోసపూరిత దిగుమతులతో లబ్ధి పొందిన కంపెనీల నుంచి వసూళ్లు చేయాలని సూచించింది. డీఎఫ్‌ఐఏ కింద గత ఐదేళ్లలో దిగుమతి అయిన వాటిని పరిశీలించి, ఆశించిన ప్రయోజనాలకు విరుద్ధమైనవి ఏవైనా ఉంటే వాటిని పథకం నుంచి మినహాయించాలని జీటీఆర్‌ఐ కోరింది. ఈ పథకం దుర్వినియోగంపై వచి్చన ఫిర్యాదులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ గ్రేడ్ (డీజీఎఫ్‌టీ) దర్యాప్తు చేస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ స్పష్టత ఇచ్చింది.
దుర్వినియోగం ఇలా..
‘‘వాస్తవానికి డీఎఫ్‌ఐఏ అన్నది ఎగుమతిదారులకు తయారీ వ్యయాలను తగ్గించేందుకు ఉద్దేశించినది. కానీ, దోపిడీకి లైసెన్స్‌గా మారింది. అధిక విలువైన వేప్రొటీన్, కుంకుమపువ్వు, వాల్‌నట్, లిథియం అయాన్ బ్యాటరీలను సున్నా కస్టమ్స్ డ్యూటీపై ట్రేడర్లు దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని బిస్కెట్లు, పచ్చళ్లు, ట్రాక్టర్లకు ముడి సరుకులుగా చూపిస్తున్నారు. వాస్తవానికి వాటిని ఎందుకూ వినియోగించడంలేదు’’అని జీటీఆర్‌ఐ వివరించింది.