రూ. 458 కోట్లుగా సంస్థ విలువ
న్యూఢిల్లీ: వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా ప్రాపర్టీ క్లాసిఫైడ్ ప్లాట్‌ఫాం హౌసింగ్‌డాట్‌కామ్‌ను కొనుగోలు చేసినట్లు రియల్టీ సంస్థ ఆరమ్ ప్రాప్‌టెక్ వెల్లడించింది. కంపెనీ విలువను రూ. 458 కోట్లుగా లెక్కగట్టి ఈ డీల్‌ను కుదుర్చుకున్నట్లు వివరించింది. ఆ్రస్టేలియాకి చెందిన ఆర్‌ఈఏ గ్రూప్‌లో హౌసింగ్‌డాట్‌కామ్ భాగంగా ఉంది. ఈ డీల్ పూర్తిగా ఈక్విటీ బదలాయింపు రూపంలో ఉంటుంది. ఆర్‌ఈఏ ఇండియాకి ఆరమ్ ప్రాప్‌టెక్ 1,97,93,309 షేర్లను జారీ చేస్తుంది.
దీనితో ఆరమ్‌లో ఆర్‌ఈఏ ఇండియా వాటా 24.9#కి పెరుగుతుంది. బీఎస్‌ఈలో ప్రస్తుత షేరు ధర ప్రకారం ఆరమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 1,900 కోట్లుగా ఉంది. ఆర్‌ఈఏ గ్రూప్ నుంచి ఆరమ్ గతంలో హౌసింగ్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫాం ప్రాప్‌టైగర్‌ను రూ. 86.45 కోట్లకు కొనుగోలు చేసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియో నెస్ట్‌ఎవే, హెలోవరల్డ్, ఆరమ్ అనలిటికా, సెల్‌డాట్‌డు, ప్రాప్‌టైగర్ మొదలైన సంస్థలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 412 కోట్లుగా, లాభం రూ. 72 లక్షలుగా
నమోదైంది.


