అమెరికన్ సంస్థ ఆర్గానాన్ కొనుగోలుకు ఒప్పందం
కంపెనీ విలువ 11.75 బిలియన్ డాలర్లు
ఒక్కో షేరుకు 14 డాలర్ల చొప్పున చెల్లింపు
ఒప్పందం పూర్తయితే టాప్ 25 గ్లోబల్ సంస్థల్లో ఒకటిగా చోటు
12.4 బిలియన్ డాలర్ల ఉమ్మడి ఆదాయం
న్యూఢిల్లీ: దేశీ ఔషధ రంగ దిగ్గజం సన్ ఫార్మా మరో భారీ డీల్‌కి తెరతీసింది. అమెరికాకు చెందిన ఆర్గానాన్ అండ్ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం సంస్థ విలువను 11.75 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 1.10 లక్షల కోట్లు) లెక్క కట్టారు. ఒక్కో షేరుకు 14 డాలర్ల చొప్పున చెల్లించి ఆర్గానాన్‌ను సన్ ఫార్మా కొనుగోలు చేయనుంది. ఇది పూర్తిగా నగదు రూపంలో ఉంటుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి 2027 తొలినాళ్లలో ఒప్పందం పూర్తవుతుందని అంచనా. దీనికి కావాల్సిన మొత్తాన్ని 2–2.5 బిలియన్ డాలర్లను అంతర్గతంగాను, మిగతా 9.25–9.75 బిలియన్ డాలర్లను రుణం రూపంలో సన్ ఫార్మా సమకూర్చుకోనుంది.
కాస్త ఆనందం.. కాస్త ఉత్కంఠ..
ఇరు కంపెనీల కలయికతో మరింత శక్తివంతమైన సంస్థ ఏర్పడుతుందని సన్ ఫార్మా చైర్మన్ దిలీప్ సంఘ్వీ తెలిపారు. ‘ఈ డీల్ విషయంలో కాస్త ఆనందంగాను, ఉత్తేజంగాను, కాస్త ఉత్కంఠగాను ఉంది. ఇది చాలా భారీ ఒప్పందం కావడం, పెద్ద మొత్తంలో రుణం తీసుకోవాల్సి రానుండటమే ఇందుకు కారణం. మేము రుణానికే తప్ప రిస్కుకు వ్యతిరేకం కాదు. అయితే, ఇప్పుడు తీసుకుబోయే రుణం భారీగానే ఉన్నప్పటికీ ఉమ్మడి సంస్థ ఎబిటాకు 2.3 రెట్లు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే ఆదాయాలను బట్టి దీన్ని త్వరలోనే తగ్గించుకోగలమనే ధీమా ఉంది.
గతంలో ర్యాన్‌బాక్సీ డీల్‌ని ఇది గుర్తు తెస్తోంది. అప్పట్లో మాది చిన్న కంపెనీ అయినప్పటికీ చాలా పెద్ద సంస్థను కొన్నాం. ఇప్పుడు అర్గానాన్ దాదాపు సన్ ఫార్మా స్థాయిదే అయినప్పటికీ సుమారు 25 శాతం తక్కువ వేల్యుయేషన్‌కే లభిస్తోంది‘ అని ఆయన పేర్కొన్నారు. ‘వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలన్నింటినీ పరిశీలించిన మీదట నగదు రూపంలో ఉండే ఈ లావాదేవీ మా వాటాదారులకు గణనీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని బోర్డు నిర్ణయించింది. అంతర్జాతీయంగా మా వ్యాపారాలు, ఉద్యోగులు, పేషెంట్లకు సన్ ఫార్మా దన్నుగా ఉంటుందని ఆశిస్తున్నాం‘ అని ఆర్గానాన్ ఎగ్జిక్యూటివ్ చెయిర్ క్యారీ కాక్స్ తెలిపారు.
ఆర్గానాన్ కథ ఇదీ...
2021లో దిగ్గజ సంస్థ మెర్క్ నుంచి విడగొట్టడం ద్వారా ఏర్పాటైన గ్లోబల్ హెల్త్‌కేర్ కంపెనీ ఆర్గానాన్. మెర్క్‌ని అమెరికా, కెనడా వెలుపల ఎంఎస్‌డీగా వ్యవహరిస్తారు. ఆర్గానాన్‌కి యూరోపియన్ యూనియన్, వర్ధమాన మార్కెట్లలో ఆరు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాల్లో గ్లోబల్ లీడరుగా కార్యకలాపాలు సాగిస్తోంది. మహిళల హెల్త్, జనరల్ మెడిసిన్స్ విభాగాల్లో బయోసిమిలర్స్ సహా 70కి పైగా ఉత్పత్తులు ఉన్నాయి. 140 దేశాల్లో విక్రయిస్తోంది. అమెరికా, యూరప్, చైన్, కెనడా, బ్రెజిల్ మొదలైనవి భారీ మార్కెట్లుగా ఉన్నాయి. 2025 డిసెంబర్ 31తో ముగిసిన సంవత్సరంలో కంపెనీ 6.2 బిలియన్ డాలర్ల ఆదాయం, 1.9 బిలియన్ డాలర్ల ఎబిటాను (సవరించిన) ఆర్జించింది. 8.6 బిలియన్ డాలర్ల రుణభారం, 574 మిలియన్ డాలర్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఇటీవలే ఒక ఉత్పత్తి విక్రయానికి గాను ముందస్తుగా 440 మిలియన్ డాలర్లు అందుకుంది.
డీల్స్ కింగ్.. సన్ ..
సన్ ఫార్మా గతంలో కూడా పలు భారీ స్థాయి కొనుగోళ్లు చేసింది. 2014లో ర్యాన్‌బాక్సీని 4 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. అలాగే 2007లో ఇజ్రాయెల్‌కి చెందిన టారో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌ని 454 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
దేశీ దిగ్గజాల భారీ షాపింగ్..
అంతర్జాతీయంగా మన కంపెనీల భారీ కొనుగోళ్ల ఒప్పందాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. 2007లో కోరస్‌ను టాటా స్టీల్ 12 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. తర్వాత 2010లో కువైట్ దిగ్గజం జెయిన్ టెలికంనకు చెందిన ఆఫ్రికా వ్యాపారాన్ని భారతి ఎయిర్‌టెల్ 10.7 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది.
సన్ ఫార్మాకు ప్రయోజనాలు..
→ 12.4 బిలియన్ డాలర్ల ఉమ్మడి ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్ 25 ఫార్మా కంపెనీల్లో ఒకటిగా సంస్థ నిలుస్తుంది.
→ గ్లోబల్‌గా మహిళల ఆరోగ్య సంరక్షణ ఔషధాలకు సంబంధించి టాప్ 3 కంపెనీల్లో ఒకటిగా చోటు దక్కుతుంది.
→ బయోసిమిలర్స్ మార్కెట్లో 7వ పెద్ద సంస్థగా ఉంటుంది.
→ 150 దేశాలు, 18 భారీ మార్కెట్లలో కార్యకలాపాలు. ఒక్కో మార్కెట్ నుంచి 100 మిలియన్ డాలర్ల కు పైగా ఆదాయం లభిస్తుంది.
షేరు 7 శాతం అప్..
సోమవారం బీఎస్‌ఈలో సన్ ఫార్మా షేరు 7 శాతం ఎగిసింది. రూ. 1,733.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ. 27,307 కోట్లు పెరిగి రూ. 4,15,987 కోట్లకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరుగా నిల్చింది.
అమెజాన్ నౌ 100 నగరాల్లోకి విస్తరణ
లిస్టులో హైదరాబాద్, వైజాగ్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ అమెజాన్ నౌ క్విక్ కామర్స్ సరీ్వసులను దేశవ్యాప్తంగా 100 నగరాల్లోకి విస్తరించనుంది. హైదరాబాద్, వైజాగ్‌తో పాటు పుణే, చెన్నై, కోల్‌కతా, జైపూర్, లక్నో తదితర నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూ రు, ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో (నేషన ల్ క్యాపిటల్ రీజియన్) అమెజాన్ నౌ సేవ లు లభిస్తున్నాయి. అమెజాన్ ఇండి యా ఇటీవల ప్రకటించిన రూ. 2,800 కోట్ల పెట్టుబడుల ప్రణాళికల్లో ఈ విస్తరణ భాగంగా ఉండనుంది. 1,000కి పైగా మైక్రో–ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు తమ క్విక్ కామర్స్ కార్యకలాపాలకు దన్నుగా ఉంటాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఎవ్రీడే ఎజెన్షియల్స్) హర్‡్ష గోయెల్ తెలిపారు. క్విక్ కామర్స్ విస్తరణతో 16,000 మందికి పైగా రైతులు తమ టెక్నాలజీ, నెట్‌వర్క్‌ని ఉపయోగించుకుని, ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు.


