దేశీయ ఆర్థిక వృద్ధిని మరింత పరుగులు పెట్టించడమే కాకుండా, విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జూన్ సమీక్షలో కీలక నిర్ణయాలు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక సమీకరణల నేపథ్యంలో భారతదేశంలో విదేశీ పెట్టుబడులకు అడ్డంకులను తొలగిస్తూ నిబంధనలను సరళీకృతం చేస్తున్నట్లు చెప్పింది. ముఖ్యంగా ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ), ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) ఊరటనిచ్చేలా కేంద్ర బ్యాంక్ కొన్ని రాయితీలను ప్రకటించింది.
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించిన కీలక చర్యల వివరాలు ఇవీ..
గ్లోబల్ ఇండెక్స్‌ల్లో భారత ప్రభుత్వ బాండ్లు
ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల నిబంధనలను ఆర్‌బీఐ సరళీకరించింది. ఇందులో భాగంగా.. ఇకపై కొత్తగా జారీ చేయబోయే 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల కాలపరిమితి గల ప్రభుత్వ బాండ్లు అన్నీ ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్’ (ఎఫ్‌ఏఆర్) కిందకు వస్తాయి.
గ్లోబల్ ఇండెక్స్‌ల్లో స్థానం: ఈ బాండ్లు అంతర్జాతీయ గ్లోబల్ ఇండెక్స్‌ల్లో భాగం కానున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు భారత్‌కు తరలివచ్చే అవకాశం ఉంది.
పరిమితుల తొలగింపు: ఇతర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులపై ఉన్న పాత పరిమితులను కూడా సెంట్రల్ బ్యాంక్ ఎత్తివేసింది.
ఎన్‌ఆర్‌ఐ పెట్టుబడి పరిమితుల పెంపు
ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) దేశీయ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల పరిమితులను భారీగా పెంచింది. అంతేకాకుండా, ఈ సదుపాయాన్ని భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తులందరికీ విస్తరింపజేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల విదేశీ నిధుల ప్రవాహం మరింత సులభతరం కానుంది.
ఫారెక్స్ మార్పిడిపై రాయితీలు
విదేశీ మారక నిల్వలను స్థిరీకరించేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు (నాలుగు నెలల పాటు) రాయితీతో కూడిన ఫారెక్స్ మార్పిడి సదుపాయాన్ని కల్పించనుంది. బ్యాంకులు 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి గల ఎఫ్‌సీఎన్‌ఆర్-బీ డిపాజిట్లను సేకరించడానికి, వాటి పూర్తి హెడ్జింగ్ ఖర్చును భరించేందుకు సెప్టెంబర్ 30 వరకు ఆర్‌బీఐ ఇదే తరహా సదుపాయాన్ని అనుమతించింది.
బాహ్య వాణిజ్య రుణాలు
ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) విదేశాల నుంచి బాహ్య వాణిజ్య రుణాలు (ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్-ఈసీబీ) సేకరించేలా ఆర్‌బీఐ తగిన ప్రోత్సాహకాలను అందించనుంది. ఎగుమతిదారులు తాము విదేశాలకు పంపిన సరుకుల ఆదాయాన్ని తిరిగి భారతదేశానికి రాబట్టే సమయాన్ని తొమ్మిది నెలలకు పునరుద్ధరిస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలు రూపాయి విలువను స్థిరీకరించడానికి, దేశీయ మార్కెట్లలోకి విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఎంతో దోహదపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ బాండ్ సూచీల్లో భారత బాండ్ల చేరిక, ఎఫ్‌పీఐ నిబంధనల సరళీకరణ వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థపై గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్!


