యూకే–భారత్‌ వాణిజ్యానికి రెక్కలు | India-UK CETA Trade Deal Indian Exports Auto Textile Benefits | Sakshi
Sakshi News home page

యూకే–భారత్‌ వాణిజ్యానికి రెక్కలు

Jun 19 2026 7:31 AM | Updated on Jun 19 2026 10:26 AM

India-UK CETA Trade Deal Indian Exports Auto Textile Benefits

జూలై 15 నుంచి అమల్లోకి సెటా

99 శాతం ఎగుమతులకు స్వేచ్ఛ

ఆటోమొబైల్, టెక్స్‌టైల్‌ ఎన్నో రంగాలకు ప్రయోజనం

న్యూఢిల్లీ: యూకే, భారత్‌ మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సెటా) ఎట్టకేలకు వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానుంది. స్వేచ్ఛాయుత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో 2025 జూలై 25న, లండన్‌లో జరిగిన కార్యక్రమంలో రెండు దేశాల ప్రధానులు ఒప్పందంపై సంతకాలు చేయడం గమనార్హం. దశలవారీగా అమలయ్యే ఈ ఒప్పందంతో వస్తు, సేవల పరంగా భారత ఎగుమతిదారులకు టారిఫ్‌ అనుకూల ప్రయోజనాలు లభిస్తాయి. 99 శాతం వస్తువులపై సుంకాలు తొలగిపోనున్నాయి.

రెండు దేశాల మధ్య వస్తు, సేవలకు మార్కెట్‌ అవకాశాలు పెంచుకోవడం, టారిఫ్‌ల భారం తగ్గించుకోవడం ఒప్పందం లక్ష్యం. ముఖ్యంగా కొన్ని ఉత్పత్తులకు కోటా ఆధారిత మార్కెట్‌ ప్రవేశం అమలు కానుంది. భారత వ్యవసాయం, డైరీ, నూనె గింజలు, కూరగాయలు, ధాన్యాలకు ఈ ఒప్పందంలో రక్షణ కల్పించారు. బ్రిటన్‌ అంచనా ప్రకారం.. సెటాతో ఏటా భారత్‌ జీడీపీకి 5.1 బిలియన్‌ పౌండ్లు, యూకే జీడీపీకి 4.8 బిలియన్‌ పౌండ్ల మేర అదనపు ప్రయోజనం లభించనుంది. దీర్ఘకాలంలో ద్వైపాక్షిక వాణిజ్యం 25.5 బిలియన్‌ పౌండ్లకు చేరుకుంటుందని అంచనా.  

గణనీయమైన అవకాశాలు.. 
‘‘సెటాతోపాటు డబుల్‌ కంట్రిబ్యూషన్‌ కన్వెన్షన్‌ (సామాజిక భద్రతకు సంబంధించి) జూలై 15 నుంచి ఏకకాలంలో అమల్లోకి రావడంతో భారత్‌ ఎగుమతిదారులకు గణనీయమైన అవకాశాలు లభించనున్నాయి. తక్షణమే 99 శాతం మన ఎగుమతులకు సుంకాల్లేని ప్రవేశం దక్కనుంది. టెక్స్‌టైల్స్, లెదర్, మెరైన్, ఇంజనీరింగ్, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ రంగాలు ఎలాంటి ప్రతికూలతల్లేకుండా తమ ఉత్పత్తులతో పోటీపడనున్నాయి. సున్నితమైన మన వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలకు దిగుమతుల నుంచి రక్షణ కల్పించాం. భారతీయ నిపుణుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ద్వంద బీమా చెల్లింపుల నుంచి కూడా మినహాయింపు ఉంటుంది’’అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు.  

ఈ రంగాలకు సానుకూలం.. 
🔹    భారత్‌ నుంచి యూకేకి వెళ్లే ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఉత్పత్తులపై 70 శాతం, మెరైన్‌ ఉత్పత్తులపై 21.5 శాతం, ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలపై 18 శాతం, లెదర్, పాదరక్షలపై 16 శాతం, టెక్స్‌టైల్స్, వ్రస్తాలపై 12 శాతం మేర సుంకాలు సున్నాకి తగ్గిపోనున్నాయి.  
🔹    డబుల్‌ కంట్రిబ్యూషన్‌ కన్వెన్షన్‌ కింద యూకేలో భారత ఉద్యోగులు, కారి్మకులకు మూడేళ్ల పాటు సామాజిక భద్రత కోసం చందాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇలా ఆదా అయ్యే మొత్తం రూ.4,000 కోట్లుగా ఉంటుంది.  
🔹    భారత్‌ సైతం యూకే నుంచి వచ్చే దిగుమతులపై దశలవారీ (2036 నాటికి) 90 శాతం మేర టారిఫ్‌లను ఎత్తేయనుంది.   
🔹    భారత్‌కు చెందిన 85 శాతం స్టీల్‌ ఎగుమతులకు యూకేలో నియంత్రణ చర్యల నుంచి మినహాయింపు ఉంటుంది.      యూకేకి చెందిన విస్కీ, జిన్‌ ఉత్పత్తులపై 150 శాతంగా ఉన్న సుంకాలు తొలుత 75 శాతానికి, పదో ఏడాదికి 40 శాతానికి తగ్గిపోనున్నాయి. దీంతో భారత్‌ మార్కెట్లో వాటి అమ్మకాలు పెరగనున్నాయి.  

చౌకగా యూకే కార్లు 
🔹    ఒప్పందం మొదటి 15 ఏళ్లలో యూకే నుంచి 3.78 లక్షల యూనిట్ల సంప్రదాయ కంబస్టన్‌ ఇంజన్‌ ప్యాసింజర్‌ కార్లను రాయితీ సుంకాలపై భారత్‌ అనుమతించనుంది. ఇందులో లగ్జరీతోపాటు మాస్‌ మార్కెట్‌ కార్లు కూడా ఉంటాయి.  
🔹    ఆటో విడిభాగాలపై 110 శాతంగా ఉన్న సుంకాలు 10 శాతానికి తగ్గుతాయి. ఇందుకు సంబంధించి రెండు దేశాలు కోటా విధానాన్ని అనుసరించనున్నాయి.  
🔹    ఒప్పందం ఆరో ఏడాది నుంచి యూకేకి ఎలక్ట్రిక్‌/హైడ్రోజన్‌ ప్యాసింజర్‌ కార్లను (20,000–80,000 పౌండ్ల ధరలోని) పరిమిత కోటా మేరకు భారత్‌ సుంకాల్లేకుండా ఎగుమతి చేయొచ్చు. ఇది టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్, ఎంఅండ్‌ఎం, మారుతి సుజుకీ తదితర కంపెనీలకు ప్రయోజనం కల్పించనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement