జూలై 15 నుంచి భారత్‌-బ్రిటన్‌ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అమలు | Historic Milestone: India UK Free Trade Pact To Come Into Force On July 15 | Sakshi
Sakshi News home page

జూలై 15 నుంచి భారత్‌-బ్రిటన్‌ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అమలు

Jun 17 2026 11:18 PM | Updated on Jun 17 2026 11:21 PM

Historic Milestone: India UK Free Trade Pact To Come Into Force On July 15

భారత్–బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. దీంతో పాటు సామాజిక భద్రతకు సంబంధించిన డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (DCC) కూడా అదే రోజు అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ పరిణామాన్ని ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించింది.

ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్‌లో 99 శాతం ట్యాక్స్‌ ఫ్రీ ప్రవేశం లభించనుంది. దీంతో వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, సముద్ర ఆహారాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి రంగాలకు విశేష ప్రయోజనం చేకూరనుంది.

ఈ డీల్‌ కుదిరిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. బ్రిటన్‌తో వాణిజ్య సంబంధాల్లో ఇది చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం రైతులు, కార్మికులు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు కొత్త అవకాశాలు కల్పించడమే కాకుండా ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనకు తోడ్పడుతుందని తెలిపారు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుశ్‌ గోయెల్‌ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఉన్న సుంక అవరోధాలను ఈ ఒప్పందం తొలగిస్తోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత ఉత్పత్తులకు సమాన పోటీ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

2021లో ప్రారంభమైన ఎన్‌హాన్స్‌డ్ ట్రేడ్ పార్ట్‌నర్‌షిప్‌, ఇండియా–యూకే రోడ్‌మ్యాప్ 2030 ఆధారంగా ఈ ఒప్పందానికి పునాది పడింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలన్న లక్ష్యంతో ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయి.

మొత్తం 30 అధ్యాయాలతో రూపొందిన ఈ ఒప్పందంలో డిజిటల్ ట్రేడ్, టెలికమ్యూనికేషన్స్, ఆర్థిక సేవలు, మేధో సంపత్తి హక్కులు, ప్రభుత్వ కొనుగోళ్లు వంటి ఆధునిక అంశాలను కూడా చేర్చారు. అయితే పాల ఉత్పత్తులు, ధాన్యాలు, చిరుధాన్యాలు, వంట నూనెలు, ఆయిల్‌సీడ్స్, ఆపిల్స్ తదితర సున్నిత రంగాల ప్రయోజనాలను భారత్ రక్షించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement