పెరుగుతున్న దేశీయ డిమాండ్‌కు తోడు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుండటంతో భారత్ పారిశ్రామికీకరణలో సరి కొత్త దశలోకి అడుగుపెడుతోందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ నివేదిక తెలిపింది. అంతరిక్షం (స్పేస్), సెమీకండక్ట ర్లు, డేటా సెంటర్లు, ఎల్రక్టానిక్స్, సోలార్ తయారీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లోకి ప్రైవేట్ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొంది. పన్ను ప్రోత్సాహకాలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ), స్థానికీకరణ(లోకలైజేషన్) నిబంధనలు వంటి ప్రభుత్వ విధాన చర్యలు కొత్త పెట్టుబడుల ఆకర్షిస్తున్నాయని తెలిపింది. తద్వారా ఉత్పత్తుల తయారీతో పాటు సప్లై చైన్, ఉపకరణాలు, మౌలిక సదుపాయాలు, ఇంజినీరింగ్ సేవల్లోనూ అవకాశాలు మరింత పెరుగుతున్నాయని వివరించింది.
కీలక రంగాల్లో ప్రగతి బాటలు
అంతరిక్ష రంగం: స్పేస్ సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ రంగానికి 2020లోనే ప్రభుత్వం అనుమతులిచ్చింది. తద్వారా ప్రైవేట్ భాగస్వామ్యంతో 2023–30 మధ్య దేశ స్పేస్ ఎకానమీని దాదాపు అయిదు రెట్లు పెంచి 40–45 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ స్టార్టప్‌లలో ‘స్కైరూట్’ ఆర్బిటల్ ప్రయోగానికి సిద్ధమవుతుండగా, ‘పిక్సెల్’ హై–రిజల్యూషన్ ఎర్త్–ఆబ్జర్వేషన్ ఉపగ్రహాలపై, ‘అగ్నికుల్’ 3డీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్లపై, ‘దిగంతర’ ఉపగ్రహ ఆధారిత స్పేస్ సరై్వలెన్స్ (నిఘా) వ్యవస్థలపై పనిచేస్తున్నాయని జెఫరీస్ తెలిపింది.
సెమీ కండక్టర్లు: భారత్ సెమీకండక్టర్ రంగం విధాన రూపకల్పన నుంచి అమలు దశకు చేరుతోంది. ఇప్పటికే సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఒక చిప్ ఫ్యాబ్ నిర్మా ణంలో ఉంది. పలు ఓఎస్‌ఏటీ ప్రాజెక్టులు ఉత్పత్తి దిశగా కదులుతున్నాయి. మరో 13 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక ప్రణాళిక సిద్ధమవుతోంది.
డేటా సెంటర్ల భారీ విస్తరణ: గడిచిన అయిదేళ్ల దేశంలో ‘కో–లొకేషన్’ సామర్థ్యం అయిదు రెట్లు పెరిగి రెండు గిగావాట్లకు చేరింది. డిజిటైజేషన్, క్లౌడ్ వినియోగంతో రాబోయే అయిదేళ్లలో 10 గిగావాట్లకు చేరవచ్చని జెఫరీస్ అంచనా వేసింది. ఈ విస్తరణ డేటా సెంటర్ ఆపరేటర్లకు సుమారు 9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చవచ్చు. విద్యుత్, కూలింగ్, నిర్మాణం, నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల్లో దాదాపు 45 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు దారితీయవచ్చని తెలిపింది.
ఎల్రక్టానిక్స్ రంగం: ఎల్రక్టానిక్స్ ఎగుమతులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎల్రక్టానిక్స్ కాంపోనెంట్స్ మానుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ఈసీఎంఎస్), మొబైల్ 2.0 వంటి పథకాలు విడిభాగాల తయారీ, బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్‌ను బలోపేతం చేయనున్నాయి. వచ్చే ఆరేళ్లలో మొబైల్ విడిభాగాల బిల్ ఆఫ్ మెటీరియల్స్‌లో ఈసీఎంఎస్ వాటా 20 శాతం నుంచి 50 శాతానికి చేరవచ్చని అంచనా. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల మార్కెట్ సుమారు 5 బిలియన్ డాలర్లు కాగా, 85–90 శాతం డిమాండ్ ప్రస్తుతం దిగుమతుల ద్వారానే తీరుతోంది.
సోలార్‌లో 90% స్థానికీకరణ: భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద సోలార్ ఫొటోవోల్టాయిక్ తయారీ దేశంగా ఎదిగిందని జెఫరీస్ తెలిపింది. ప్రస్తుతం 35 గిగావాట్ల సోలార్ సెల్ సామర్థ్యం కార్యకలాపాల్లో ఉండగా, మరో 100 గిగావాట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఏఎల్‌ఎంఎం పాలసీలు, దేశీయ విడిభాగాల వినియోగ నిబంధనలతో పాటు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) వంటి ప్రభుత్వ నిర్ణయాలు సోలార్ తయారీ రంగంలో కీలకమైన సెల్స్, వేఫర్స్, ఇంగాట్స్ సహా సమగ్ర తయారీ వ్యవస్థ బలపడేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయి. తద్వారా 2030 నాటికి సోలార్ తయారీ వాల్యు చైన్‌లో 90 శాతం స్థానికీకరణ సాధించే అవకాశం ఉందని పేర్కొంది.
ఏరోస్పేస్‌లోనూ అవకాశాలు: బోయింగ్, ఎయిర్‌బస్ వంటి అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలు భారత్ నుంచి ఏటా సుమారు 1.4–1.6 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను సేకరిస్తున్నాయి. ఏక్వస్, ఆజాద్, బీహెచ్‌ఎఫ్‌సీ, డీవైటీసీ, ఆర్‌డబ్ల్యూ, మదర్‌సన్, సన్‌సెరా వంటి భారతీయ సంస్థలు గ్లోబల్ ఓఈఎంలు, టైర్–1 సరఫరాదారులకు ఉత్పత్తులు అందిస్తున్నాయి. భవిష్యత్తులో భారత్ కేవలం ఔట్‌సోర్సింగ్ కేంద్రంగా కాకుండా తయారీ, ఇంజినీరింగ్‌లోనూ వాటాను పెంచుకోగలదని నివేదిక పేర్కొంది.
గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ దూకుడు
స్పేస్, సెమీకండక్టర్లు, ఎల్రక్టానిక్స్, సోలార్, డేటా సెంటర్లు, ఏరోస్పేస్.. ఈ రంగాలన్నింటిలోనూ భారత్ ప్రపంచ సప్లై చైన్‌లో మరింత కీలక పాత్ర దిశగా అడుగులు వేస్తోందని జెఫరీస్ విశ్లేషించింది. భారీ దేశీయ మార్కెట్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, డిజిటైజేషన్, స్థానికీకరణ, తయారీ–మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న డిమాండ్ ఈ మార్పుకు చోదకశక్తులుగా నిలుస్తున్నాయని తెలిపింది. మొత్తంగా దేశీయ డిమాండ్‌ను, విధాన మద్దతును ఉపయోగించుకుని స్థానిక సామర్థ్యాలను పెంచడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, గ్లోబల్ టెక్నాలజీ, తయారీ సరఫరా సప్లైలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడం ఈ ‘పారిశ్రామిక వ్యూహం’ సారాంశమని జెఫరీస్ పేర్కొంది.
ఇదీ చదవండి: అసలు బ్రిక్స్‌లో ఏం చర్చిస్తారు?


