
గత అంచనాలు కొనసాగింపు
ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రకటన
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) భారత జీడీపీ 6.5% వృద్ధి రేటు నమోదు చేస్తుందన్న గత అంచనాలను కొనసాగిస్తున్నట్టు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ (అంతర్జాతీయ రేటింగ్ సంస్థ) ప్రకటించింది. వర్షాలు సమృద్ధిగా పడడం, ఆదాయపన్ను, జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో దేశీ వినియోగం బలంగా ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ పెట్టుబడులు సైతం పెరుగుతాయని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో 3.2 శాతానికి పరిమితం అవుతుందని, దీంతో ఆర్‌బీఐ మరో విడత పావు శాతం మేర రెపో రేటును తగ్గించొచ్చని తన తాజా నివేదికలో పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. అంచనాలకు మించి ఆహార ధరలు తగ్గడం.. ప్రస్తుత ఏడాదిలో ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలోనే కొనసాగేందుకు మద్దతుగా ఉంటుందని తెలిపింది. ఇది తదుపరి రేట్ల కోతకు వెసులుబాటునిస్తుందని అభిప్రాయపడింది. ఆసియా దేశాల ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లు.. వాటి ఎగుమతులు, ప్రాంతీయ సరఫరా పరిస్థితులపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. ‘‘యూఎస్ టారిఫ్‌లపై జూన్‌లో వేసిన మా అంచనాల తర్వాత పరిణామాలను గమనిస్తే.. ఇప్పటి వరకు ఇతర దేశాల కంటే చైనా మెరుగ్గా వ్యవహరించింది. ఆగ్నేయాసియా అభివృద్ధి మార్కెట్లపై ప్రభావం పడగా, భారత్‌పై ఇది మరింత ఎక్కువగా ఉంది’’ అని ఎస్‌అండ్‌పీ వివరించింది.