
క్యూ1లో 12.4 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 12.4 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన 8.43 బిలియన్ డాలర్లతో పోలిస్తే 47 శాతం పెరిగాయి. ఇండియా సెల్యులార్, ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొబైల్ ఫోన్స్ ఎగుమతులు 55 శాతం పెరిగి 4.9 బిలియన్ డాలర్ల నుంచి 55 శాతం వృద్ధితో 7.6 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.
మొబైల్‌యేతర ఎల్రక్టానిక్స్ సెగ్మెంట్ 3.53 బిలియన్ డాలర్ల నుంచి 37 శాతం పెరిగి 4.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ విభాగంలో సోలార్ మాడ్యూల్స్, స్విచి్చంగ్.. రూటింగ్ పరికరాలు, చార్జర్ అడాప్టర్లు, ఇతర విడిభాగాలు మొదలైనవి ఉన్నాయి.
వీటితో పాటు ఐటీ హార్డ్‌వేర్, వేరబుల్స్, హియరబుల్స్, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ ఎగుమతులను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రూ చెప్పారు. విడిభాగాలు, సబ్–అసెంబ్లీస్ నుంచి తుది ఉత్పత్తుల వరకు వేల్యూ చెయిన్‌వ్యాప్తంగా అంతర్జాతీయంగా పోటీపడగలిగేలా భారతీయ బ్రాండ్లు మరింతగా ఎదగాల్సి ఉంటుందని మహీంద్రూ చెప్పారు. దశాబ్దకాలంలో దేశీయంగా మొత్తం ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి 31 బిలియన్ డాలర్ల నుంచి 133 బిలియన్ డాలర్లకు ఎగిసింది.
50 బిలియన్ డాలర్ల అంచనాలు..
క్యూ1 తరహాలోనే జోరు కొనసాగితే 2026 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 46–50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఐసీఈఏ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇవి 29.1 బిలియన్ డాలర్ల నుంచి 38.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి.