రానున్న దశాబ్దాల్లో గ్లోబల్ మార్కెట్‌కు మన దేశమే ప్రధాన వృద్ధి ఇంజిన్
గడిచిన 20 ఏళ్లు చైనాది.. ఇకపై రాబోయే కాలం భారత్‌దే!
‘గ్లోబల్ స్టీల్ డైనమిక్స్ ఫోరమ్ 2026’ సదస్సులో లక్ష్మీ మిట్టల్ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌లో స్టీల్ వినియోగం రానున్న దశాబ్దాల్లో భారీగా పెరగనుందని ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తెలిపారు. దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ మౌలిక వసతుల విస్తరణ, వేగవంతమైన పట్టణీకరణ, గృహ నిర్మాణ రంగ వృద్ధి, హరిత ఇంధన ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులు స్టీల్‌కు బలమైన డిమాండ్‌ను సృష్టిస్తాయని పేర్కొన్నారు. తద్వారా ప్రపంచ స్టీల్ డిమాండ్ పెరుగుదలకు భారత్ కీలక మార్కెట్‌గా, ప్రధాన వృద్ధి ఇంజిన్‌గా అవతరించనుందని అభిప్రాయపడ్డారు. న్యూయార్క్‌లో జరిగిన ‘గ్లోబల్ స్టీల్ డైనమిక్స్ ఫోరమ్ 2026’ సదస్సులో వీడియో సందేశం ద్వారా మిట్టల్ మాట్లాడారు.
ఇకపై భారత్ వంతు..
వచ్చే జూలై 31 నాటికి ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ ఏర్పడి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లక్ష్మీ మిట్టల్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘చైనా అసాధారణ వృద్ధికి గడిచిన 20 ఏళ్లు సాక్ష్యంగా నిలిచాయి. ఇప్పుడు భారత్ వంతు వచి్చంది. దేశంలో భారీ ఎత్తున మౌలిక వసతుల విస్తరణ, పట్టణ గృహ నిర్మాణ రంగంలో వృద్ధి, ఇంధన పరివర్తనకు అవసరమైన ప్రాజెక్టుల కల్పన తదితర అంశాలు ఉక్కు రంగంలో భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి’’ అని మిట్టల్ పేర్కొన్నారు.
విలీనంతో సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నాం
2006లో మిట్టల్ స్టీల్, ఆర్సెలర్ సంస్థల విలీనంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థగా ఆర్సెలర్‌మిట్టల్ ఆవిర్భవించిందని లక్ష్మీ మిట్టల్ తెలిపారు. ఈ విలీనం సంస్థకు పరిమాణం (స్కేల్), వ్యాపార వైవిధ్యం, స్థిరత్వం, వ్యూహాత్మక విస్తరణ పరంగా గణనీయ బలాన్ని చేకూర్చిందన్నారు. ‘‘20 ఏళ్ల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఈ విలీనం మరింత బలమైన సంస్థను నిర్మించిందనే నమ్మకం ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, కోవిడ్–19 మహమ్మారి వంటి ఊహించని ‘బ్లాక్ స్వాన్’ పరిణామాల ప్రభావాలు ఇప్పటికీ కనిపిస్తున్నప్పటికీ, ఈ సవాళ్లను విలీన సంస్థగా మరింత సమర్థంగా ఎదుర్కోగలిగాం. భారీ వ్యాపార పరిమాణం, విభిన్న మార్కెట్లలో ఉనికి, సంక్షోభాలను తట్టుకునే సామర్థ్యం మాకు బలంగా నిలిచాయి’’ అని మిట్టల్ వ్యాఖ్యానించారు.
టెక్నాలజీతో మారుతున్న రంగం..
రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం స్టీల్ పరిశ్రమ పూర్తిగా గ్లోబలైజ్ అయిందని, సాంకేతికత, డేటా ఆధారితంగా రూపాంతరం చెందిందని మిట్టల్ అభిప్రాయపడ్డారు. ఉక్కు మార్కెట్లను రూపొందించడంలో ఆయా దేశాల ’స్థానిక పారిశ్రామిక విధానాలు’ కూడా ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తుచేశారు. పర్యావరణ, నియంత్రణ సంస్థల ఒత్తిళ్లు పెరుగుతున్నప్పటికీ.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో డిమాండ్, కార్బన్ ఉద్గారాల తగ్గింపు కోసం జరుగుతున్న పెట్టుబడుల వల్ల స్టీల్ రంగానికి దీర్ఘకాలంలో తిరుగుండదన్నారు. ‘‘స్టీల్ పరిశ్రమలో 50 ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా నేను ఉండాలనుకునే రంగం ఇదే. భవిష్యత్తులోనూ అనూహ్య సవాళ్లు ఎదురైనా, ఈ రంగం దీర్ఘకాలిక ఫండమెంటల్స్ మాత్రం బలంగానే ఉన్నాయి’’ అని మిట్టల్ అన్నారు.


