2030 నాటికి 20 లక్షల కొలువులు..! | India Battery Industry Create 20 Lakh Jobs by 2030 Adecco Report | Sakshi
Sakshi News home page

2030 నాటికి 20 లక్షల కొలువులు..!

Sep 12 2026 8:40 AM | Updated on Sep 12 2026 8:40 AM

India Battery Industry Create 20 Lakh Jobs by 2030 Adecco Report

భారత బ్యాటరీ పరిశ్రమ భారీగా ఉద్యోగాలను సృష్టించే దశలోకి ప్రవేశిస్తోంది. ఇప్పటివరకు లిథియం–అయాన్‌ సెల్‌ల దిగుమతి, అసెంబ్లింగ్‌పై ఆధారపడిన ఈ రంగం.. సెల్‌ తయారీ నుంచి బ్యాటరీ ప్యాక్‌ల తయారీ, రీసైక్లింగ్‌ వరకు పూర్తిస్థాయి పారిశ్రామిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో 2029–30 నాటికి దేశీయ బ్యాటరీ పరిశ్రమ 15 లక్షల నుంచి 20 లక్షల ఉద్యోగాలను సృష్టించనుందని గ్లోబల్‌ స్టాఫింగ్‌ సంస్థ ‘అడెక్కో ఇండియా’ నివేదిక తెలిపింది.

దేశంలోని 30కి పైగా క్లయింట్‌ కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలను వెల్లడించింది. మొత్తం ఉద్యోగాల్లో సుమారు 25 శాతం ప్రత్యక్షంగా, 75 శాతం పరోక్షంగా ఉండనున్నాయి. ఈ రంగంలో నియామకాలు ఏటా 25–30 శాతం పెరగనున్నాయని అడెక్కో ఇండియా జనరల్‌ స్టాఫింగ్‌ డైరెక్టర్, హెడ్‌ దీపేష్‌ గుప్తా తెలిపారు. 

నాలుగు రాష్ట్రాల్లోనే 70 శాతానికి పైగా నియామకాలు 

గుజరాత్, కర్ణాటక, హర్యానా, తెలంగాణలో గిగాఫ్యాక్టరీల పెట్టుబడులు పెరుగుతుండటంతో బ్యాటరీ రంగ నియామకాల్లో 70 శాతానికి పైగా ఈ క్లస్టర్లలోనే కేంద్రీకృతం కానున్నాయి. రాష్ట్రాల వారీగా కర్ణాటక 24 శాతం, గుజరాత్‌ 22 శాతం, తెలంగాణ 18 శాతం, హర్యానా 14 శాతం వాటాతో ముందంజలో ఉండనున్నాయి. గిగాఫ్యాక్టరీల చుట్టూ కాంపోనెంట్‌ పార్కులు, బ్యాటరీ రీసైక్లింగ్‌ కేంద్రాలు, సరఫరాదారుల వ్యవస్థలు అభివృద్ధి చెందడంతో కొత్త నియామక అవసరాల్లో సుమారు 30 శాతం టైర్‌–2, టైర్‌–3 పారిశ్రామిక కారిడార్ల నుంచి వచ్చే అవకాశం ఉంది.

నైపుణ్యం ఉన్నవారికి 40 శాతం వరకు అధిక వేతనాలు

సాంప్రదాయ తయారీ, ఎల్రక్టానిక్స్‌ రంగాలతో పోలిస్తే.. బ్యాటరీ ఇంజనీరింగ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, మెటీరియల్‌ సైన్స్, రీసైక్లింగ్‌ నైపుణ్యాలు ఉన్న నిపుణులకు 35 శాతం నుండి 40 శాతం వరకు అధిక వేతనాలు లభిస్తాయని నివేదిక స్పష్టం చేసింది. 2030 నాటికి దేశంలో వచ్చే మొత్తం ‘గ్రీన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌’ ఉద్యోగాల్లో 50 నుండి 60 శాతం వాటా లిథియం బ్యాటరీ తయారీ రంగానిదే కానుండటం విశేషమని అడెక్కో నివేదిక తెలిపింది.

సెల్‌ తయారీకి పెద్దపీట

మొత్తం నియామకాల్లో సెల్‌ తయారీ, బ్యాటరీ విడిభాగాల తయారీ విభాగం 42–45 శాతం వాటాతో అతిపెద్ద భాగంగా ఉండనుంది. బ్యాటరీ రీసైక్లింగ్, మెటీరియల్స్‌ రికవరీ కూడా కీలక ఉపాధి రంగాలుగా మారుతున్నాయి. ఈ విభాగంలో నియామకాలు ఏటా 25–30 శాతం పెరుగుతాయని అంచనా. ప్రస్తుతం దేశంలో బ్యాటరీ తయారీ సామర్థ్యం సుమారు 60 జీడబ్ల్యూహెచ్‌గా ఉండగా, 2026 చివరి నాటికి ఇది దాదాపు 100 జీడబ్ల్యూహెచ్‌కు చేరుతుందని అడెక్కో తెలిపింది. గుజరాత్, కర్ణాటక, హర్యానా, తెలంగాణలో రానున్న గిగాఫ్యాక్టరీ పెట్టుబడులతో ఈ రంగం అసెంబ్లింగ్‌ స్థాయి నుంచి పూర్తిస్థాయి పారిశ్రామిక ఎకోసిస్టమ్‌గా విస్తరించనుంది.

రూ.18,100 కోట్ల ప్రభుత్వ మద్దతు

అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్స్‌ (ఏసీసీ) తయారీకి సంబంధించిన పీఎల్‌ఐ పథకం కింద 50 జీడబ్ల్యూహెచ్‌ దేశీయ తయారీ సామర్థ్యం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.18,100 కోట్లు కేటాయించింది. మరో 5 జీడబ్ల్యూహెచ్‌ సామర్థ్యాన్ని ప్రత్యేక రసాయన సాంకేతికతలకు కేటాయించింది. ఈ స్థానికీకరణ ప్రక్రియ ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యానికి దోహదపడటంతో పాటు, దిగుమతి చేసుకునే సెల్స్, శుద్ధి చేసిన ముడి పదార్థాలపై దేశం ఆధారపడటాన్ని తగ్గించనుందని కంపెనీ తెలిపింది. క్రిటికల్‌ మినరల్స్‌ మిషన్, క్వాడ్‌ క్రిటికల్‌ మినరల్స్‌ ఇనిషియేటివ్‌ ఫ్రేమ్‌వర్క్‌లో భారత్‌ భాగస్వామ్యం కూడా ఈ ప్రక్రియకు మద్దతుగా నిలుస్తున్నాయని పేర్కొంది.

ఇదీ చదవండి: అసలు బ్రిక్స్‌లో ఏం చర్చిస్తారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement