హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ జోరు.. | Hyderabad second Largest Housing Supply Market Home Sales rise Q2 2026 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ జోరు..

Jun 26 2026 1:02 PM | Updated on Jun 26 2026 2:00 PM

Hyderabad second Largest Housing Supply Market Home Sales rise Q2 2026

దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హైదరాబాద్ మరోసారి తన బలాన్ని చాటుకుంది. 2026 రెండో త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో నగరంలో గృహ విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు రెండూ గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కొత్త ఇళ్ల సరఫరాలో హైదరాబాద్ దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా నిలవడం విశేషం. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ (PropEquity) విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో మొత్తం గృహ విక్రయాలు ఏడాది క్రితంతో పోలిస్తే 19 శాతం పెరిగి 1,12,458 యూనిట్లకు చేరగా, కొత్త గృహాల ప్రారంభాలు 43 శాతం పెరిగి 1,17,609 యూనిట్లకు చేరాయి. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత గృహ మార్కెట్‌పై వాటి ప్రభావం పెద్దగా కనిపించలేదని నివేదిక పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన కూడా విక్రయాలు 14 శాతం, కొత్త సరఫరా 27 శాతం పెరిగాయి.

హైదరాబాద్‌లో ఈ త్రైమాసికంలో 14,410 ఇళ్లు విక్రయం కాగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 22 శాతం అధికం. మరోవైపు 18,407 కొత్త గృహ యూనిట్లు మార్కెట్‌లోకి రావడం ద్వారా సరఫరా 75 శాతం పెరిగింది. ఈ పెరుగుదలతో పుణె, థానే, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లను వెనక్కి నెట్టి, బెంగళూరు తర్వాత దేశంలో రెండో అతిపెద్ద హౌసింగ్ సప్లై మార్కెట్‌గా హైదరాబాద్ అవతరించింది.

దక్షిణ భారత నగరాలే ఈసారి మార్కెట్‌కు ప్రధాన చోదకశక్తిగా నిలిచాయి. బెంగళూరులో విక్రయాలు 47 శాతం పెరిగి 21,516 యూనిట్లకు చేరి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. చెన్నైలో కూడా 18 శాతం వృద్ధి నమోదైంది. పశ్చిమ భారత నగరాల్లో నవీ ముంబై, ముంబై బలమైన వృద్ధిని నమోదు చేయగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్, కోల్‌కతాల్లో మాత్రం విక్రయాలు తగ్గాయి.

రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, హైదరాబాద్‌లో ఐటీ, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (GCCs) విస్తరణ, మెట్రో కనెక్టివిటీ, కోకాపేట్–ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్–నర్సింగి వంటి ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల ప్రారంభం గృహ డిమాండ్‌ను బలోపేతం చేస్తున్నాయి. ఇదే సమయంలో నాణ్యమైన ప్రాజెక్టులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు డెవలపర్లు కూడా వేగం పెంచుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement