
భారతదేశంలో ఏదైనా కొత్త వాహనం కొన్నప్పుడు దానికి వాహన పూజ చేయించడం ఆనవాయితీ. వాహనాన్ని స్థానిక గుడికి తీసుకెళ్లి పసుపు, కుంకుమ, పూలదండలతో అలంకరిస్తారు. పూజారి ఆ వాహనానికి పూజ చేసి కొబ్బరి కాయ కొడతారు. ఇలా చేస్తే వాహనాలు ఎటువంటి ప్రమాదాలకూ గురికాకుండా దేవుని ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతారు. తరతరాలుగా అనుసరిస్తున్న ఈ ఆనవాయితీ ఎలక్ట్రిక్, ఫ్యూచరిస్టిక్ వాహనాల యుగంలో కూడా కొనసాగుతోంది.
ఇటీవలే అల్ట్రా రెడ్ టెస్లా మోడల్ వై కారును కొనుగోలు చేసిన హైదరాబాద్కు చెందిన డాక్టర్ ప్రవీణ్ కోడూరు కూడా తన కారుకు వాహనపూజ చేయించారు. ఈ సందర్భంగా కొత్త టెస్లా కారును పసుపు, కుంకుమలు, పూలదండలతో అలంకరించి కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పంచుకున్నారు. "వాహన పూజ చేయకపోతే టెస్లాతో సహా ఏ కారు కూడా భారతీయ సంస్కృతిలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందదు" అని రాసుకొచ్చారు.
ఈ పోస్ట్ వెంటనే సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. చాలా మంది తమదైన శైలిలో దీనిపై ప్రతిస్పందించారు. "హా హా !! భారతీయ సౌందర్యంలో ఈ కారు మరింత మెరుగ్గా కనిపిస్తుంది"అని ఓ యూజర్ పేర్కొనగా "భారతదేశంలో వాహన పూజే అంతిమ క్రాష్ టెస్ట్ సర్టిఫికేషన్" అని మరొకరు చమత్కరించారు.
టెస్లా ఈ ఏడాది జూలైలో భారత్ లోకి ప్రవేశించింది. లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ కోడూరు గత వారం తన టెస్లా మోడల్ వై కారును డెలివరీ తీసుకున్నారు. ఇది హైదరాబాద్లో మొదటిది. మోడల్ వై కారు రెండు ఇండియన్ వేరియంట్లలో లభిస్తుంది. 60kWh బ్యాటరీతో రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ.59.89 లక్షలు కాగా 75kWh బ్యాటరీతో లాంగ్ రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ మోడల్ ధర 67.89 లక్షల నుండి ప్రారంభమవుతాయి. టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) ప్యాకేజీ కావాలంటే మరో రూ.6 లక్షలు అదనం.
No car , including Tesla, can get a five star safety rating in Indian culture, unless a vahan Pooja is done @elonmusk @TeslaClubIN @Tesla_India 😀🙏🏻😛 pic.twitter.com/5TxuGQzcPY
— Dr Praveen koduru (@drpraveenkoduru) October 1, 2025