
అమెరికా టారిఫ్‌ల వల్ల నెలకొన్న ఒడిదుడుకుల ప్రభావం మనపై స్వల్పకాలికంగానే ఉంటుందని యూనియన్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎండీ మధు నాయర్ చెప్పారు. దీర్ఘకాలికంగా చూసినప్పుడు, భారీ రుణభారం ఉన్న అమెరికా, ప్రస్తుతంతో పోలిస్తే కాస్త బలహీనపడొచ్చని ఆయన చెప్పారు. పరిస్థితులు క్రమంగా స్థిరపడి భారత్‌లాంటి దేశాలకు మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు.
మన మార్కెట్లలో తీవ్ర స్థాయిలో కరెక్షన్ రాకపోవచ్చన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల సంగతి అలా ఉంచితే, భారత ఆర్థిక మూలాలు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో దేశీయంగా మార్కెట్లలోకి పెట్టుబడుల ప్రవాహం పటిష్టంగా ఉంటోందని నాయర్ చెప్పారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు, ఈపీఎఫ్ నిధులు, రిటైల్ ఇన్వెస్టర్లు, యులిప్స్ వంటి మార్గాల్లో ప్రతి నెలా రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు.
రూ.లక్ష కోట్ల ఏయూఎం లక్ష్యం
రాబోయే అయిదేళ్లలో రూ. లక్ష కోట్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) స్థాయిని సాధించాలని నిర్దేశించుకున్నట్లు నాయర్ చెప్పారు. ప్రస్తుతం ఇది సుమారు రూ. 23,000 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. అధిక వృద్ధి సాధన దిశగా ప్రస్తుత పథకాలపై మరింతగా దృష్టి పెట్టడంతో పాటు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నట్లు నాయర్ తెలిపారు. సెప్టెంబర్ 1న డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: టెలికాం టారిఫ్‌లు పెంపు?
అర్థయ పేరిట స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఎస్‌ఐఎఫ్)ను నవంబర్‌లో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రస్తుతం కన్జూమర్ డిస్క్రిషనరీ, టెలికం, క్యాపిటల్ గూడ్స్/ఇండస్ట్రియల్స్ రంగాలు పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండగా ఇంధన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయని నాయర్ చెప్పారు.