
ఈ ఏడాది చివరికల్లా టెలికాం ఆపరేటర్లు కొత్త టారిఫ్ పెంపును ప్రకటిస్తారని పరిశ్రమ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దాంతో మళ్లీ అధిక రీఛార్జ్ బిల్లులు చెల్లించాల్సి వస్తుందని భారతీయ మొబైల్ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య ఈ పెరుగుదల ఉండొచ్చని ఇక్రా ప్రతినిధి అంకిత్ జైన్ తెలిపారు. అయితే ఈ పెంపు టెలికాం కంపెనీని అనుసరించి మొత్తం టారిఫ్‌లో 15-20% కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని, ఇది 2024లోని పెంపు కంటే తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు.
‘టెలికాం కంపెనీల టారిఫ్ పెంపు తప్పదు. మొత్తం టారిఫ్‌లో ఇది 15-20 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. 2025 ఆర్థిక సంవత్సరంలో ఒక వినియోగదారుడి నుంచి కంపెనీలకు సమకూరే సగటు ఆదాయం(ఆర్పూ) రూ.200గా ఉంది. ఇది 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.220కు పెరుగుతుంది’ అని అంకిత్ అన్నారు.
గతంలో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు టారిఫ్‌లను 19-21 శాతం పెంచాయని, దీంతో కొంతమంది వినియోగదారులు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారని నిపుణులు చెబుతున్నారు. ఈసారి ప్లాన్ వ్యాలిడిటీ పీరియడ్స్ మార్చకుండా ధరల పెంపుపై ఆపరేటర్లు దృష్టి సారిస్తారని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ఐసీఐసీఐ పేదల బ్యాంకు కాదా? మినిమం బ్యాలెన్స్ రూల్స్‌లో మార్పు
భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే డేటా టారిఫ్‌లను పెంచే సూచనలు చేసింది. ‘భారత్‌లో మొబైల్ టారిఫ్ డిజైన్ తారుమారుగా ఉంది. సంపన్నులు తక్కువ చెల్లిస్తున్నారు. పేదలు కూడా వారితో సమానంగా పే చేస్తున్నారు. ఇది మారాల్సి ఉంది’ అని భారతీ ఎయిర్‌టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ కంపెనీ ఇటీవల తెలిపారు. రిలయన్స్ జియో ప్రతినిధులు ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత 5జీ పెట్టుబడులకు మద్దతు ఇవ్వడానికి టారిఫ్ దిద్దుబాట్లు అవసరమని చెప్పారు.