భారత్‌లో పని సంస్కృతి మార్పు క్రమంలో ఉందని, భవిష్యత్తు అంతా ప్రయోగాత్మక పని విధానాలు, పరిస్థితులకు అనుణంగా మార్పులను స్వీకరించే వారిదేనని మెజారిటీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇండీడ్ కోసం వాలువోక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేకు సంబంధించి వివరాలతో ‘వర్క్‌ప్లేస్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025’ విడుదలైంది. ప్రయోగాత్మక పని నమూనాలు, పరిస్థితులకు అనుగుణంగా మారే వారికే భవిష్యత్తు ఉంటుందని 58 శాతం మంది భారత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
రివర్స్ మెంటారింగ్ (సీనియర్లకు జూనియర్ల మార్గదర్శనం), మైక్రో రిటైర్మెంట్ (కెరీర్‌లో స్వల్ప విరామాలు), ఏఐ మూన్‌షైనింగ్ (జాబ్ టాస్కుల కోసం ఏఐని గోప్యంగా వినియోగించడం), ఏఐ వాషింగ్, స్కిల్ నోమడిజమ్ (పనికి సంబంధించి కొత్త నైపుణ్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం) వంటి కొత్త పని ధోరణులును ప్రయోగాత్మక పని నమూనాలుగా ఈ నివేదిక అభివర్ణించింది. 2,584 మంది ఉద్యోగులు, 1,288 సంస్థల అభిప్రాయాలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు.
వృద్ధికే ప్రాధాన్యం..
వృద్ధికే మొదటి ప్రాధాన్యమని ప్రతి ఐదుగురు భారత ఉద్యోగుల్లో ఇద్దరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు అదనపు నైపుణ్యాలు నేర్చుకోవడం, రోజువారీ విధులతో ఏఐని అనుసంధానించడం వంటివి అనుసరిస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించడం వరకే కాకుండా.. కొత్తగా నేర్చుకునేందుకు, తమని తాము తిరిగి ఆవిష్కరించుకునేందుకు గాను కొంత సమయం కేటాయింపు, ప్రస్తుత ఉద్యోగంలో విరామం అవసరమని ఉద్యోగులు భావిస్తున్నారు.
ఎప్పుడూ పనిచేసుకుపోవడం అన్న విధానానికే పరిమితం కాకుండా.. విరామం, తిరిగి నైపుణ్యాలు ఆర్జించడం వంటి కొత్త ధోరణి ఉద్యోగుల్లో కనిపిస్తోంది. 41 శాతం మంది ఉద్యోగులు తమకంటూ బలమైన సరిహద్దులు విధించుకుని, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నట్టు చెప్పారు. నైపుణ్యాల పెంపునకు ఎక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నట్టు ఇండీడ్ ఇండియా ఎండీ శశికుమార్ తెలిపారు. వ్యక్తిగత వృద్ధి, సంప్రదాయేతర పని ఏర్పాట్లు భవిష్యత్తు కార్పొరేట్ ఇండియా ప్రధాన లక్షణాలుగా ఉంటాయన్నారు.


