
గత కొంతకాలంగా ఉద్యోగులను భయపెడుతున్న ఒకే ఒక అంశం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ. దీనివల్ల ఉద్యోగాలు పోతాయని, ప్రపంచంలోని చాలా దేశాల్లో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుందని.. కొందరు నిపుణులు కూడా వెల్లడించారు. ఇందులో ఏ మాత్రం నిజం ఉంది?, నిజంగానే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా?, నివేదికలు ఏం చెబుతున్నాయనే.. విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఏఐ దాదాపు అన్ని రంగాల్లోనూ.. సంచనలం సృష్టించింది. దీంతో చాలామంది భయపడ్డారు. అయితే ప్రస్తుతం కొన్ని నివేదికలు మాత్రం ఊహించినదానికి భిన్నంగా ఉన్నాయని, ఉద్యోగాలు ఎక్కడికీ పోవని చెబుతున్నాయి. అమెరికా డేటా.. ఏఐ ఉన్నప్పటికీ ఏడాదిలో ఇంటర్ప్రిటేషన్, ట్రాన్స్లేషన్కి సంబంధించిన ఉద్యోగాలు ఏడు శాతం పెరిగాయని చెబుతోంది. మనుషులను ఏఐ రీప్లేస్ చేస్తుందని చెప్పిన కంపెనీలు కూడా.. ఇప్పుడు మనిషి అవసరం ఖచ్చితంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి.

సగటు ఉద్యోగులతో పోలిస్తే.. ఫ్రెషర్లు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని అమెరికా డేటా వెల్లడించింది. ఏఐ రాకముందు కూడా ఫ్రెషర్స్ ఈ పరిస్థితులనే ఎదుర్కొన్నారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకున్నవారికి తప్పకుండా ఉద్యోగాలు లభించకుండా ఉండే అవకాశం లేదు.
చాలా కంపెనీలు ఏఐలను ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు చేసే పనుల్లో ఉపయోగిస్తున్నాయి. మొత్తం మీద అమెరికాలో ఉద్యోగులు లభించని ఫ్రెషర్స్ కేవలం నాలుగు శాతం మంది మాత్రమే ఉన్నారు. యూఎస్ఏలో మాత్రమే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా ప్రెషర్స్ పరిస్థితి ఇలాగే ఉంది. పరిస్థితులను చూస్తుంటే.. నిరుద్యోగులు పెరగడానికి లేదా ఉద్యోగాలు లభించకపోవడానికి కేవలం ఏఐ మాత్రమే కారణం చెప్పడానికి ఆస్కారం లేదు.

బ్రిటన్, జపాన్ వంటి దేశాల్లో ఏఐ ఉన్నప్పటికీ.. ఉద్యోగుల జీతాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే.. ఉద్యోగులను తొలగించాలనే ఉద్దేశ్యం దాదాపు కంపెనీలకు లేదు, అంతే కాకుండా వారికి మంచి జీతాలను ఇవ్వడానికి కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
దిగ్గజ కంపెనీలన్నీ.. ప్రతి ఆపరేషన్లోనూ ఏఐలను తీసుకొస్తామని చెబుతూనే ఉన్నాయి. అయితే ముఖ్యమైన పనులకు మాత్రం ఏఐలను ఉపయోగించడం లేదు. అమెరికాలో కేవలం 10 శాతం కంపెనీలు మాత్రమే ఏఐలను గూడ్స్ అండ్ సర్వీస్ కోసం విరివిగా వాడుతున్నారని తెలుస్తోంది.
ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి
ఒకవేళ కంపెనీలు ఏఐలను తీసుకున్నప్పటికీ.. ఉద్యోగులను వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏఐ మనిషిని రీప్లేస్ చేయదు, మనిషితో కలిసి పనిచేస్తుంది, పని వేగంగా జరగడానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఏఐ వల్ల ఉద్యోగాలు భారీగా పోతాయనేది కేవలం ఓ అపోహ మాత్రమే. ప్రస్తుతానికి ఉద్యోగులు నిశ్చితంగా ఉండవచ్చు, అయితే.. మారుతున్న ప్రపంచంలో మనగలగాలి అంటే.. టెక్నాలజీలో ,ముందుండాలన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు.