
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పొదుపు ఖాతాలకు కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా ఎంఏబీ పెంచడంతో ఖాతాదారులు, ఫైనాన్స్ నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంక్ సవరించిన పాలసీ ప్రకారం.. మెట్రో, అర్బన్ కస్టమర్లకు ఎంఏబీ ఐదు రెట్లు పెరిగి రూ.50,000కు చేరింది. సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.25 వేలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు రూ.10,000గా ఉంది. ఇది మునుపటి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ మార్పులు కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులపై ఈ విధానం ప్రభావం చూపదని చెప్పింది.
ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?
ఈ నిర్ణయం వ్యూహాత్మకమేనని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. తక్కువ బ్యాలెన్స్ ఉన్న చాలా మంది పొదుపు ఖాతాదారులు ఐసీఐసీఐ బ్యాంకును ద్వితీయ ఖాతాగా భావిస్తున్నారు. అదే సమయంలో ప్రీమియం కస్టమర్లతో సమానంగా బ్యాంకు సేవలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల రాబడులు లేకుండానే నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నట్లు బ్యాంకు భావిస్తోంది. తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను ‘మ్యూల్ ఖాతాలు(అనైతిక కార్యకలాపాలు, మనీలాండరింగ్ కోసం ఉపయోగించేలా)’గా వాడే అవకాశం ఉంది. ఖాతాల్లో అధిక బ్యాలెన్స్ మెయింటైన్ చేసే కస్టమర్లపై దృష్టి పెట్టడం ద్వారా బ్యాంక్ ఈ మ్యూల్ ఖాతాలను లక్ష్యం చేసుకోనుంది. ఈ కొత్త విధానం ద్వారా స్థిర ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తుంది. ప్రీమియం కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడం, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు, కొత్త ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కోసం మూలధనాన్ని ఉపయోగించాలని చూస్తుంది.
వ్యాపారంపై ప్రభావం?
ఈ పెంపు వల్ల ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ (ఎస్ఏ) నిష్పత్తి లేదా ప్రాఫిట్ మార్జిన్లపై ఎలాంటి ప్రభావం ఉండదని బ్యాంకు పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కస్టమర్లు తమ అవసరాలను తీర్చడంలో బ్యాంకు విఫలమైతే పెనాల్టీ ఛార్జీల నుంచి ప్రయోజనం పొందవచ్చని చెబుతున్నారు. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీఏ-జీరో బ్యాలెన్స్ ఖాతాలు) ఖాతాలకు ఈ నిబంధన వర్తించదు. పెన్షనర్లు, శాలరీ అకౌంట్లు, రూ.2 లక్షల పొదుపు, ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే కస్టమర్లకు మినహాయింపులు ఇచ్చారు.
విమర్శలు ఎందుకు?
ముఖ్యంగా అధిక శాతం మంది ఖాతాదారులు నెలకు రూ.25,000 కంటే తక్కువే సంపాదిస్తున్నారు. అలాంటిది బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో స్థిరంగా నగదు మెయింటెన్ చేయాలంటే వారి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పొదుపు ఖాతాలో రూ.50,000 ఎంఏబీ చాలామంది భారతీయులకు ఆచరణీయం కాదు. 90 శాతం మంది భారతీయులు నెలకు రూ.25,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ఈ మార్పు వారికి శాపంగా మారుతుంది’ అని ప్రముఖ బ్యాంకర్ జే కోటక్ తన ఎక్స్ ఖాతాలో చెప్పారు.
ఇదీ చదవండి: సోదరుడికి పంపిన లీగల్ నోటీసు విత్‌డ్రా
బ్యాంకు చర్యల ద్వారా ప్రీమియం క్లయింట్లకు ప్రాధాన్యత ఇస్తూ, మాస్ మార్కెట్ విభాగాన్ని దూరం చేసుకుంటుందని కొందరు చెబుతున్నారు. ఆర్థిక సమ్మిళితం(ఫైనాన్షియల్ ఇన్‌క్యూజన్) అనే విస్తృత జాతీయ లక్ష్యాన్ని ఇది బలహీనపరుస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంఏబీలను తక్కువగా లేదా జీరోగా ఉంచుతున్న తరుణంలో ఐసీఐసీఐ బ్యాంక్ బహుళ సేవా ఛార్జీలను (ఏటీఎం, విత్‌డ్రా, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ మొదలైన వాటిపై) వసూలు చేస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంకు విధానానికి విరుద్ధంగా మిడ్ సైజ్ బ్యాంకులు ఎన్నో సర్వీసులు అందిస్తున్నాయి. పొదుపు ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ ఇస్తున్న బ్యాంకులున్నాయి. ప్రాథమిక లావాదేవీలపై ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదు. రూ.25,000 ఎంఏబీతో కస్టమర్లకు ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా ఇస్తున్నాయి.
ఇతర బ్యాంకులు ఇదే బాటలో నడుస్తాయా?
బ్యాంకింగ్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్లను పెంచడంపై దృష్టి పెట్టింది. పెరుగుతున్న డిపాజిట్ల పోటీ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్, పలు మిడ్ టైర్ ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసీఐ చర్యను అనుకరించే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.