
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 3.2 శాతం పెరిగి (కన్సాలిడేటెడ్) రూ. 13,357 కోట్లకు చేరింది. ప్రొవిజనింగ్ తగ్గడమనేది మార్జిన్ క్షీణత ప్రభావాలను అధిగమించేందుకు తోడ్పడింది. స్టాండెలోన్ ప్రాతిపదికన లాభం రూ. 11,746 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ. 12,359 కోట్లకు చేరింది.
మరోవైపు, 10.6 శాతం రుణాల వృద్ధి దన్నుతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 7.4 శాతం పెరిగి రూ. 21,529 కోట్లకు చేరింది. అయితే, నికర వడ్డీ మార్జిన్ మాత్రం 4.36 శాతం నుంచి 4.30 శాతానికి పరిమితమైంది. రాబోయే రోజుల్లో నికర వడ్డీ మార్జిన్లు స్థిర శ్రేణిలో తిరుగాడవచ్చని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా తెలిపారు.
అయితే, రిజర్వ్ బ్యాంక్ గానీ నగదు నిల్వల నిష్పత్తిని తగ్గిస్తే ఇది మెరుగుపడొచ్చని, పోటీ తీవ్రత వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపొచ్చని పేర్కొన్నారు. చిన్న వ్యాపార సంస్థల రుణాల నాణ్యత దిగజారే అవకాశాలపై స్పందిస్తూ.. బిజినెస్ బ్యాంకింగ్ సెగ్మెంట్లో రుణాల పరిస్థితి మెరుగ్గానే ఉందని బాత్రా చెప్పారు. అందుకే ఆ విభాగానికి రుణాలను పెంచుకుంటున్నట్లు తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో రిటైల్ రుణాలు సహా క్రెడిట్ వృద్ధి పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశీ కార్పొరేట్ల వద్ద పుష్కలంగా నిధులున్నాయని, రుణాలను సమకూర్చుకునేందుకు ఇతరత్రా మార్గాలు కూడా ఉన్నాయని బాత్రా చెప్పారు.
ఆర్థిక ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు..
క్యూ2లో వార్షిక ప్రాతిపదికన రూ. 1,233 కోట్ల నుంచి, త్రైమాసికాలవారీగా రూ. 1,815 కోట్ల నుంచి ప్రొవిజనింగ్ రూ. 914 కోట్లకు తగ్గింది. స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) రూ. 5,073 కోట్ల నుంచి స్వల్పంగా రూ. 5,034 కోట్లకు తగ్గాయి. జీఎన్‌పీఏ నిష్పత్తి 1.97 శాతం నుంచి 1.67 శాతానికి తగ్గింది. డిపాజిట్ వృద్ధి 9.1 శాతంగా ఉంది.
రిటైల్ రుణాలు 6.6 శాతం పెరిగాయి. మొత్తం లోన్ బుక్‌లో వీటి వాటా 52.1 శాతంగా ఉంది. బిజినెస్ బ్యాంకింగ్ పోర్ట్‌ఫోలియో 24.8 శాతం వృద్ధి చెందింది. కార్పొరేట్ రుణాలు 3.5 శాతం పెరిగాయి.
క్యాపిటల్ అడెక్వసీ 17.31 శాతంగా ఉంది.
ట్రెజరీ లావాదేవీలు మినహా వడ్డీయేతర ఆదాయం 13.2 శాతం పెరిగి రూ. 7,356 కోట్లుగా నమోదైంది. ట్రెజరీ ఆదాయం మాత్రం రూ. 680 కోట్ల నుంచి ఏకంగా రూ. 220 కోట్లకు పడిపోయింది.