దేశీయంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను కలిగిన ఐటీ సర్వీసుల దిగ్గజం కాగ్నిజెంట్ ఈ ఆర్థిక సంవత్సరం(2025) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. జూలై–సెప్టెంబర్(క్యూ3)లో యూఎస్ కంపెనీ నికర లాభం 53 శాతం క్షీణించి 27.4 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఈ కాలంలో 39 కోట్ల డాలర్లమేర నగదేతర ఆదాయ పన్ను వ్యయాల కారణంగా లాభాలు దెబ్బతిన్నట్లు కంపెనీ పేర్కొంది.
గతేడాది(2024) క్యూ3లో 58.2 కోట్ల డాలర్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 7 శాతంపైగా ఎగసి 541.5 కోట్ల డాలర్లను తాకింది. ఏఐలో పెట్టుబడులు ఇందుకు సహకరించగా.. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను తాజాగా మెరుగుపరచింది. వెరసి ఇంతక్రితం ప్రకటించిన 20.7–21.1 బిలియన్ డాలర్లను 21.05–21.1 బిలియన్ డాలర్లకు సవరించింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే.
ఈ బాటలో చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో 5.27–5.33 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. ఈ క్యూ3లో ఆర్డర్ల బుకింగ్స్ 5 శాతం నీరసించగా.. 6,000 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,49,800ను తాకింది. ఈ ఏడాది 15,000–20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించే బాటలో సాగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.


