రూ.కోట్లలో అద్దెలు వసూలు చేసుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలో కారుచౌకగా భూములు
దీని వెనుక ప్రభుత్వ కీలక నేత పాత్ర
క్యాంపస్‌ల నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కారు అప్పనంగా భూ కేటాయింపులు
రూ.వేల కోట్ల విలువైన భూమి కేవలం 99 పైసలకే
అందులో 55 శాతమే క్యాంపస్.. మిగిలిందంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే
ఇవి కాకుండా పెట్టుబడిలో 60 నుంచి 70% ప్రోత్సాహకాల పేరిట వాటి ఖాతాలోకే
తాజాగా కె.రహేజా గ్రూపునకు విశాఖలో 27.10 ఎకరాలు 99 పైసలకే కేటాయింపు
ఇందులో 45 శాతం భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి
బెంగళూరుకు చెందిన ‘సత్వా’కు రూ.1,500 కోట్ల భూమి రూ.45 కోట్లకే కేటాయింపు
మధురవాడలో 30 ఎకరాల్లో 50 శాతం రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి పచ్చజెండా
కపిల్ చిట్‌ఫండ్స్ బీవీఎం ఎనర్జీకి 30 ఎకరాలు.. అందులో 40 శాతం స్థలంలో
‘రియల్’ వ్యాపారం.. ఏఎన్‌ఎస్‌ఆర్‌కు మధురవాడలో 10 ఎకరాలు కేటాయింపు
రియల్ ఎస్టేట్ సంస్థ ఉర్సాకు కారుచౌకగా భూములిస్తూ గతంలో మంత్రివర్గ నిర్ణయం
ఏపీఐఐసీ విలువైన భూములు ప్రైవేటు పార్కుల పాలసీ పేరిట అడ్డగోలుగా కేటాయింపు
బాబు సర్కారు భూ దాహంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారులు
సాక్షి, అమరావతి: అసలవి ఐటీ కంపెనీలే కావు.. పక్కా రియల్ ఎస్టేట్ సంస్థలు! ఎంత ఖరీదైనా సరే భూములు కొనుగోలు చేసి, వాణిజ్య సముదాయాలు నిర్మించి విక్రయించుకోవడం లేదా లీజుకు ఇవ్వడం ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటాయి. అలాంటి రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు చంద్రబాబు సర్కారు ఐటీ డెవలప్‌మెంట్ పేరుతో విశాఖలో విలువైన భూములను పప్పు బెల్లాల మాదిరిగా పంచి పెట్టేస్తోంది. కారుచౌకగా భూములను కట్టబెట్టడమే కాకుండా, అవి నిర్మాణానికి చేసిన వ్యయంలో 50 నుంచి 60 శాతం తిరిగి ఇచ్చే విధంగా భారీ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తోంది.
కె.రహేజా, తెలుగు రాష్ట్రాలకు చెందిన కపిల్ చిట్‌ఫండ్స్ బీవీఎం ఎనర్జీ, బెంగళూరుకు చెందిన సత్వా డెవలపర్స్, ఏఎన్‌ఎస్‌ఆర్, ఫినోమ్ పీపుల్.. తదితర రియల్ ఎస్టేట్ సంస్థలకు ఐటీ ముసుగులో ఎటువంటి వేలం లేకుండా విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా కట్టబెడుతోంది. ఐటీ ముసుగులో భూములిచ్చేస్తూ అందులో 40 నుంచి 50 శాతం స్థలంలో ఐటీ కార్యకలాపాలు కాకుండా గృహ, వాణిజ్య సముదాయాలు నిరి్మంచి అమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే విధంగా బంపర్ ఆఫర్ ఇస్తోంది. నిజానికి ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు నిరి్మంచే వాణిజ్య సముదాయాల్లో ఒక్క ఐటీ ఉద్యోగం కూడా నేరుగా ఇవ్వవు.

అవి నిర్మించిన భవనాల్లో వచ్చే ఐటీ కంపెనీలు మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తాయి. కానీ వాటిని రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థల ఖాతాల్లో వేసి వేల ఉద్యోగాలంటూ భారీ రాయితీలను ప్రకటిస్తూ రెండిందాల ప్రయోజనాన్ని చేకూరుస్తుండటంపై అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ప్రమోటర్లు తెరపైకి తెచ్చిన ఉర్సా లాంటి అనామక కంపెనీకి భూమి కేటాయిస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని అభాసుపాలైనప్పటికీ భూ కేటాయింపుల విషయంలో చంద్రబాబు సర్కారు వెనక్కి తగ్గడం లేదు. భవనాలు నిర్మించి రూ.కోట్లలో అద్దెలు ముక్కుపిండి వసూలు చేసే రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వం ఇలా కారుచౌకగా భూములు పందేరం చేయడం వెనుక ప్రభుత్వంలోని కీలక నేత చక్రం తిప్పుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇటీవల చంద్రబాబు సర్కారు రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించిన భూముల వివరాలివీ...
కపిల్ చిట్‌ఫండ్ ఖాతాలో..

తెలుగు రాష్ట్రాల్లో చిట్‌ఫండ్, రియల్ ఎస్టేట్, మీడియా రంగాల్లో విస్తరించిన కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చంద్రబాబు సర్కారు విశాఖ పనోరమా హిల్స్ వెనుక ఎండాడ వద్ద ఎకరా రూ.1.5 కోట్లు చొప్పున 30 ఎకరాలు కేటాయిస్తోంది. ఎండాడ వద్ద బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.100 కోట్లు పెట్టినా భూమి దొరకని పరిస్థితి. అంటే సుమారు రూ.3,000 కోట్ల విలువైన భూమిని హెచ్‌ఎంటీవీ లాంటి మీడియా సంస్థలు కలిగిన కపిల్ గ్రూపునకు కేవలం రూ.45 కోట్లకే కేటాయిస్తోంది. కపిల్ గ్రూపు విశాఖలో రూ.1,250 కోట్ల పెట్టుబడితో 15,000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదే తరహాలో మరిన్ని కంపెనీలకు వాటి వ్యాపారాల కోసం ప్రభుత్వం భూములు ఇచి్చంది. వెంచర్ ఫండ్స్ నుంచి నిధులు సేకరించి ఐటీ పార్కులు ముఖ్యంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీ)ను ఆకర్షించే పేరుతో బెంగళూరుకు చెందిన ఏఎన్‌ఎస్‌ఆర్ గ్లోబల్ కార్పొరేషన్‌కు మధురవాడ ఐటీ హిల్ నెం. 3పై ప్లాట్ నంబర్ 6 వద్ద 2.5 ఎకరాల భూమి, హిల్ నంబర్ 4పై ప్లాట్ నంబర్ యూడీఎల్ 6 వద్ద 7.79 ఎకరాలను కేవలం 99 పైసలకే కట్టబెట్టింది. అంతేకాకుండా ఐటీ ఇన్‌ఫ్రా డెవలపర్ కేటగిరీ కింద పలు రాయితీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఏఎన్‌ఎస్‌ఆర్ రూ.1,000 కోట్ల పెట్టుబడితో 10,000 మందికి ఉపాధి కల్పించనుంది. అలాగే ఫినోమ్ పీపుల్ ప్రై.లి.కు మధురవాడ ఐటీ హిల్ నంబర్–2లో 0.45 ఎకరాలు, రుషికొండ హిల్ నంబర్–4లో మరో 4ఎకరాలను ఎకరా రూ.4.05 కోట్లు చొప్పున కేటాయించింది. ఇలా చంద్రబాబు ప్రభుత్వం అత్యంత విలువైన భూములను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతుండటంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటమే కాకుండా కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ సంస్థలకు పారిశ్రామికపార్కులు
పేదల నుంచి కారు చౌకగా సేకరించిన భూములను పారిశ్రామిక పార్కుల పేరుతో ప్రైవేటు సంస్థలకు పప్పు బెల్లాల మాదిరి కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేసింది. పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాల్సిన ఏపీఐఐసీ ఆ పని వదిలేసి రియల్ ఎస్టేట్ సంస్థల అడుగులకు మడుగులొత్తుతోంది. ఇప్పటికే ఐటీ పార్కుల ముసుగులో విశాఖలో రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేసిన బాబు సర్కారు తాజాగా రాష్ట్రవ్యాప్తంగా పేదల అసైన్డ్ భూములను కార్పొరేట్ రాబందులకు కట్టబెడుతోంది. ఏపీ ప్రైవేట్ ఇండ్రస్టియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే ఇండ్రస్టియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పాలసీ 2024–29 పేరిట కార్పొరేట్ సంస్థల పరం చేస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలో 39 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పేరిట 5,221.09 ఎకరాలను టీడీపీ పెద్దలు తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
100 ఎకరాలు పైబడిన వాటిని లార్జ్ పార్కులుగా, ఆ లోపు వాటిని ఎంఎస్‌ఎంఈ పార్కులుగా వర్గీకరించి డిజైన్, నిర్మాణం, నిర్వహణకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. మొత్తం 13 లార్జ్ పార్కుల కింద 4,737.86 ఎకరాలు, 16 ఎంఎస్‌ఎంఈ పార్కుల కింద 483.23 ఎకరాలను కట్టబెట్టనుంది. అంతేకాదు.. ప్రైవేట్ ఇండ్రస్టియల్ పార్కుల పాలసీ కింద ఎకరానికి రూ.3 లక్షల క్యాపిటల్ సబ్సిడీతో పాటు పలు రాయితీలను కల్పించనుంది. వాణిజ్య భవనాలు, గృహ సముదాయాలు, గిడ్డంగులు లాంటి నిర్మాణాలు చేపట్టే రియల్ ఎస్టేట్ సంస్థలు పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో పాలు పంచుకోవచ్చని నిర్ణయించడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు పార్కుల పాలసీ ముసుగులో తమకు కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడమే దీని వెనుక వ్యూహమని స్పష్టం చేస్తున్నారు. పారిశ్రామిక పార్కుల్లో కన్వెన్షన్ సెంటర్లు, విద్యా సముదాయాలు, ఆస్పత్రులు, హోటల్స్, షాపింగ్ మాల్స్, వినోద కేంద్రాలు లాంటి నిర్మాణాలకు అనుమతిస్తున్నారంటే దీని వెనుక దాగిన ‘రియల్’ ఉద్దేశాలను అర్థం చేసుకోవచ్చని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కొత్తచోట్ల కాకుండా ఇప్పటికే ఏపీఐఐసీ సేకరించి అభివృద్ధి చేయడం ద్వారా రూ.వేల కోట్లు పలుకుతున్న జయంతిపురం, రాంబిల్లి, కోసల నగరం, రౌతుసురమాల, తిమ్మసముద్రం, సంత»ొమ్మాళి లాంటి చోట్ల ప్రైవేటు వ్యక్తులకు భూముల కేటాయింపులు చేయడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.1,375 కోట్ల భూమి.. కేవలం 99 పైసలకే
ఉద్యోగాలిచ్చేది ఐటీ కంపెనీలు.. ప్రోత్సాహకాలు రియల్ ఎస్టేట్ సంస్థలకు

రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీ కె.రహేజా గ్రూపునకు చంద్రబాబు సర్కారు విశాఖలో అత్యంత కారుచౌకగా కేవలం 99 పైసలకే ఏకంగా 27.10 ఎకరాలు కేటాయించింది. మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 3లో 27.10 ఎకరాలను ఏపీ లాండ్ ఇన్సెంటివ్స్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ పేరుతో ఇచ్చింది. ప్రస్తుతం మధురవాడ ఐటీ హిల్‌లో ఎకరా ధర రూ.50 కోట్లపైనే ఉంది. ఈ లెక్కన సుమారు రూ.1,375 కోట్ల విలువైన భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టింది. అంతేకాదు.. రహేజాకు కేటాయించిన 27.10 ఎకరాల్లో 45 శాతం భూమిని ఐటీ కాకుండా ఇతర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు అనుమతించింది.
వీటికి అదనంగా రూ.91.2 కోట్లతో రహదారులు, నీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతులు కూడా కలి్పస్తామంటూ హామీ ఇచ్చింది. మొత్తం రూ.2,172.26 కోట్లతో నిరి్మంచనున్న ఐటీ క్యాంపస్‌ల ద్వారా 15,000 మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నా ఆ ఉద్యోగాలేమీ రహేజా గ్రూపు సొంతంగా ఇవ్వదు. అది అభివృద్ధి చేసిన ఐటీ బిల్డింగ్‌లో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలే ఆ ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు ఐటీ కంపెనీలు కల్పిస్తుంటే.. ఆ పేరుతో పెట్టుబడి మొత్తంలో 60 నుంచి 70 శాతం ప్రోత్సాహకాల రూపంలో దోచిపెడుతుండటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రూ.1,500 కోట్ల భూమి ‘సత్వా’కు రూ.45 కోట్లకే
రియల్ ఎస్టేట్ కంపెనీకి మధురవాడలో విలువైన స్థలం

బెంగళూరుకు చెందిన సత్వా గ్రూపు రెండు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. పుణే, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో భారీ లగ్జరీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసింది. బ్లాక్ స్టోన్ లాంటి పీఈ, వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి నిధులు సేకరించి వ్యాపారం చేస్తుంది. 2017లో సత్వా గ్రూప్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వద్ద 10 ఎకరాల స్థలాన్ని భారీ ధరకు కొనుగోలు చేసింది. తాజాగా అక్కడే కోకాపేట వద్ద 25 ఎకరాల భూమిని రూ.వేల కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. ఇలా ప్రైవేటుగా స్థలాలు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సత్వా సంస్థకు చంద్రబాబు సర్కారు విశాఖలో 30 ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టింది.
విశాఖ గ్రామీణ మండలం మధురవాడ ఐటీ హిల్ నెం.4 వద్ద ప్లాట్ నంబర్లు యూడీఎల్ 1, యూడీఎల్ 2, యూడీఎల్ 3 వద్ద 30 ఎకరాల భూమిని ఎకరా రూ.1.5 కోట్ల సబ్సిడీ ధరకే ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మధురవాడ ఐటీ హిల్స్‌లో ఎకరా రూ.50 కోట్లపైనే పలుకుతోంది. రూ.1,500 కోట్ల విలువైన ఖరీదైన భూమిని కేవలం రూ.45 కోట్లకే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పగించడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సత్వా గ్రూపునకు సబ్సిడీ ధర మీద భూమి కేటాయించడమే కాకుండా ఏపీ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 కింద పెట్టుబడి రాయితీ, విద్యుత్ సబ్సిడీ, ఎస్‌జీఎస్టీ మినహాయింపు లాంటి అనేక అదనపు రాయితీలను కూడా ప్రభుత్వం కలి్పస్తోంది. సత్వా డెవలపర్స్ హైదరాబాద్‌లో 10,350 చదరపు అడుగుల విస్తీర్ణానికి నెలకు రూ.10 లక్షలకుపైగా అద్దెను వసూలు చేస్తోందని, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఇక్కడ కూడా అదే స్థాయిలో అద్దెలను వసూలు చేస్తుందని పేర్కొంటున్నారు.


