అనంతపురం: జిల్లాలోని యల్లనూరు ఘటనలో పోలీసుల ఏకపక్ష వైఖరి బయటపడింది. జనవరి 1వ తేదీన వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ప్రతాపరెడ్డిపై హత్యాయత్నం జరిగిన కేసుకు సంబంధించి దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలను పోలీసులు ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదు. ఆ సమయంలో నలుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరొకవైపు వైఎస్సార్‌సీపీ నేతలపై తిరిగి కేసులు నమోదు చేస్తున్నార పోలీసులు. 13 మంది వైఎస్సార్ సీపీ నేతలను అరెస్ట్ చేశారు.
మారణాయుధాలతో దాడులకు పాల్పడిన టీడీపీ నేతలపై పోలీసులు కన్నేత్తి కూడా చూడలేదు. 23 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినా ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. దీనికి సంబంధించి పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.
కాగా,నూతన సంవత్సర వేడుకల వేళ ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరులో పచ్చ బ్యాచ్ బరితెగించింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేశారు. యల్లనూరు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతలు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రతాప్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు.


