సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పాలనలో నిత్యం అపచారాలు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో మద్యం బాటిళ్ల వెనుక వైఎస్సార్‌సీపీ పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు
‘‘తప్పుడు కేసు బనాయించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యమే కొండపై తిష్ట వేసింది. ఖాళీ మద్యం బాటిళ్లను కవర్ చేసినవారిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆ సీసీ ఫుటేజ్ బయటపెట్టమని సవాల్ చేస్తున్నా. 25 గోనె సంచులు నిండా ఖాళీ మద్యం బాటిల్స్ బయట పడింది నిజం కాదా?. చంద్రబాబు, బీఆర్ నాయుడు ఒత్తిళ్లతో కోటిని బలవంతంగా కొట్టారు. తిరుమల టు టౌన్ సీఐ శ్రీరాములు..వైఎస్సార్‌సీపీ కార్యకర్త మణిని కొట్టారు.
బీఎన్.ఎస్ సెక్షన్ 152 పెట్టడం అత్యంత దారుణం. న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి మేము బతికి బట్టకడుతున్నాం. లేదంటే మాకు జైళ్లే అవాసకేంద్రాలుగా మారేవి. మా సవాల్ ను స్వీకరించాలి.. మొత్తం ఆ సీసీ పుటేజ్ బయట పెట్టాలి. అలిపిరి వద్ద నిఘా వ్యవస్థ, భద్రత వ్యవస్థ ఏం చేస్తోంది?. బీఆర్ నాయుడి ప్రైవేట్ సైన్యం తాగి పడేసి బాటిల్స్ అవి. నీకు లక్షలు, వేల కోట్లు ఎలా వచ్చాయి? కోటి అనే వ్యక్తి మద్యం బాటిల్స్ పెట్టినట్లు సాక్ష్యం చూపించమని సవాల్ విసురుతున్నా.. మేము హైందవ ధర్మ పరిరక్షణ కు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము మీరు చర్చకు సిద్ధం’’ అని భూమన తేల్చి చెప్పారు.
‘‘మీరు అరెస్ట్ చేసినా నా గొంతు ఆగదు.. తిరుమలపై ఏది జరిగినా ప్రశ్నిస్తాము. మీరు చేస్తున్నా ఘోరాలు, నేరాలు ప్రజలకు తెలియజేస్తాం. పోలీసులు బలి పశువులయ్యారు. సీఐ శ్రీరాములు చేసినది తప్పు.. తీవ్రవాది పట్ల ప్రవర్తించేలా ఉంది. సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ ఇంటికి 40 మంది పోలీసులను పంపించి భయభ్రాంతులు చేశారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.


