చంద్రగిరి: ఎస్వీ వెటర్నరీలో గురువారం ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో మొదటి రోజు శాస్త్రవేత్తలు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 60 మందికి పైగా శాస్త్రవేత్తలు, పశువైద్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీ వెటర్నరీ వీసీ డాక్టర్ జేవీ రమణ హాజరై, మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు పరిశోధన ఫలితాలను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పంజాబ్‌కు చెందిన డాక్టర్ ఉదయబీర్ సింగ్ చహాల్, హిమాచల్ ప్రదేశ నుంచి డాక్టర్ శివాని కటోచ్‌లు భారతీయ పశుపోషణ సంఘం ప్రతినిధిలుగా పాల్గొని ప్రసంగించారు. సదస్సుకు సంబంధించిన పలు పుస్తకాలను వారు ఆవిష్కరించారు. డాక్టర్ వెంకటేశ్వర్లు, రాజమ్మ, రాణి, త్రివేణి పాల్గొన్నారు.
ఆందోళన వద్దు..
గ్యాస్ నిల్వలున్నాయ్
తిరుపతి అర్బన్: లబ్ధిదారులకు ఆందోళన అవసరం లేదని, గ్యాస్ నిల్వలు అవసరం మేరకు ఉన్నాయని జాయింట్ కలెక్టర్ గోవిందరావు వెల్లడించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లాలోని గ్యాస్ డీలర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుకింగ్ చేసిన వెంటనే వంట గ్యాస్ సిలిండర్లు అందించేలా డీలర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధంతో జిల్లాలో గ్యాస్ నిల్వలకు ఢోకా లేదని వెల్లడించారు. గ్యాస్ కొరత ఉందని పెద్ద ఎత్తున వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. అలాగే వంట గ్యాస్‌తోపాటు వసతి గృహాల్లోని పిల్లలకు అవసరం అయిన మేరకు గ్యాస్ సిలిండర్లు అందించాలని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటికి పరిష్కారం చూపుతామని చెప్పారు. జిల్లాలో గ్యాస్ డీలర్లను పర్యవేక్షించాలని పౌరసరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజును ఆదేశించారు.
28 నుంచి
డీడీఈ డిప్లొమా పరీక్షలు
తిరుపతి సిటీ: ఎస్వీయూ డీడీఈ ఆధ్వర్యంలో డిప్లొమో ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ కోర్సుకు సంబంధించి థియరీ పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పరీక్ష ఫీజును ఈనెల 15వ తేదీ లోపు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.


