
సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్ ఛైర్మన్ కళానిధి మారన్ ఆయన సోదరుడు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మధ్య తలెత్తిన న్యాయ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు కంపెనీ తెలిపింది. కళానిధి మారన్‌కు వ్యతిరేకంగా దయానిధి జారీ చేసిన అన్ని లీగల్ నోటీసులను ఉపసంహరించుకున్నట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
సన్‌టీవీ ఛైర్మన్ కళానిధి మారన్‌తోపాటు మరో ఏడుగురిపై గతంలో ఆయన సోదరుడు దయానిధి మారన్ లీగల్ నోటీసులు పంపించడంతో పరిస్థితులు తీవ్రంగా పరిణమించాయి. కళానిధి మారన్ తన వ్యాపార కార్యకలాపాల్లో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కళానిధిపై చర్యలు తీసుకోవాలని దయానిది కోరారు. కళానిధి మారన్ భార్య కావేరి మారన్‌కు కూడా నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఉన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో దయానిధి మారన్ లీగల్ నోటీసులు ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేసింది.
కళానిధి మారన్ సారధ్యం వహిస్తున్న సన్ గ్రూప్ ఆధ్వర్యంలో టెలివిజన్, రేడియో, ప్రింట్, సినిమా, క్రీడా విభాగాల్లో వ్యాపారాలున్నాయి. కళానిధితో సంబంధం ఉన్న కీలక కంపెనీలు, వెంచర్ల జాబితా కింది విధంగా ఉంది.
మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్
సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్ - 37 టీవీ ఛానళ్లు నిర్వహిస్తోంది.
సన్ పిక్చర్స్ - చిత్ర నిర్మాణ సంస్థ.
సన్ డైరెక్ట్ - డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) శాటిలైట్ టీవీ సర్వీస్.
సన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ - కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ.
కేఏఎల్ పబ్లికేషన్స్ / కుంగుమమ్ పబ్లికేషన్స్ - కుంగుమమ్ తమిళ పత్రికను ప్రచురిస్తుంది.
కేఏఎల్ కేబుల్స్ - కేబుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్.
కేఏఎల్ రేడియో / సౌత్‌ఏషియా ఎఫ్ఎమ్ - సూర్యన్ ఎఫ్ఎమ్, రెడ్ ఎఫ్ఎమ్ వంటి బ్రాండ్ల ద్వారా 69 ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లను నిర్వహిస్తుంది.
ప్రింట్ మీడియా
దినకరన్ - ఈ గ్రూపునకు చెందిన ప్రముఖ తమిళ దినపత్రిక.
క్రీడలు
సన్ రైజర్స్ హైదరాబాద్ - ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ.
సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ - దక్షిణాఫ్రికా టీ20 లీగ్ జట్టు.
ఇదీ చదవండి: కొత్త ఆదాయపన్ను బిల్లులోని ముఖ్యాంశాలు
గతంలోని వెంచర్
స్పైస్ జెట్ - మారన్ 2010 నుంచి 2015 వరకు కేఏఎల్ ఎయిర్ వేస్ ద్వారా మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు. ఆర్థిక అనిశ్చితి కారణంగా అందులో నుంచి నిష్క్రమించారు.