స్టాలిన్ చాణ‌క్యం.. ఏక‌మైన‌ మార‌న్ బ్ర‌ద‌ర్స్! | How MK Stalin Resolve Dispute Between Maran Brothers Over Sun TV Profit Feud, Read Full Story For Complete Details | Sakshi
Sakshi News home page

స్టాలిన్ చొర‌వ‌.. స‌మసిన మార‌న్ బ్ర‌ద‌ర్స్ గొడవ‌!

Jul 10 2025 4:35 PM | Updated on Jul 10 2025 5:57 PM

How MK Stalin Resolve Dispute Between Maran Brothers Over Sun TV

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత‌ ఎంకే స్టాలిన్ మ‌రోసారి చ‌క్రం తిప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు త‌ల‌నొప్పిగా మారిన కుటుంబ వివాదాన్ని చ‌క్క‌దిద్దారు. డీఎంకే పార్టీకి ఇబ్బందిక‌రంగా మారిన మార‌న్ సోద‌రుల ఆస్తి గొడ‌వ‌కు ముగింపు ప‌లికారు. స‌రైన స‌మ‌యంలో క‌ల్పించుకుని అన్న‌ద‌మ్ముల వివాదాన్ని ప‌రిష్క‌రించారు. త‌మ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ద్రవిడర్ కజగం అధ్యక్షుడు కె వీరమణి, హిందూ దినపత్రిక మాజీ సంపాద‌కుడు ఎన్ రామ్ సహాయంతో మార‌న్ సోద‌రుల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చారు. మార‌న్ కుటుంబంతో పాటు డీఎంకేలోనూ అల‌జ‌డి రేగ‌కుండా కాచుకున్నారు.

భారీగా ద‌యా'నిధి'
ఆస్తుల్లో త‌న‌కు రావాల్సిన‌ వాటా కోసం అన్న క‌ళానిధి మార‌న్‌పై కోర్టుకెక్కిన డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్‌కు భారీగానే నిధి ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. దాదాపు రూ. 800 కోట్ల నగదు.. అంతే విలువైన‌ చెన్నైలోని ఎలైట్ బోట్ క్లబ్ ప్రాంతంలో ఎకరం భూమిని పొందారని మారన్ కుటుంబం, డీఎంకే ఉన్న‌త వ‌ర్గాలు వెల్ల‌డించిన‌ట్టు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' తెలిపింది. మొత్తానికి ద‌యానిధి మార‌న్ (Dayanidhi Maran) తాను అనుకున్న‌ది సాధించార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు గుస‌గ‌స‌లాడుతున్నాయి. ఎందుకంటే ఆస్తుల వివాద ప‌రిష్కారానికి త‌న‌కు రూ. 1500 కోట్లు ఇవ్వాల‌ని అంత‌కుముందు ఆయ‌న డిమాండ్ చేసిన‌ట్టు తెలిసింది.

అస‌లేంటి గొడ‌వ?
తన అన్నయ్య కళానిధికి జూన్ ప్రారంభంలో ద‌యానిధి లీగల్ నోటీసు పంప‌డంతో మారన్ సోదరుల వివాదం బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిసింది. సన్ టీవీ నెట్‌వర్క్ షేర్ల‌ను అక్ర‌మంగా త‌న పేరు మీద బ‌ద‌లాయించుకున్నార‌ని ద‌యానిధి ఆరోపించారు. సన్ టీవీ నెట్‌వర్క్ ఒక ప్రైవేట్ కంపెనీగా ఉన్నప్పుడు.. మోసపూరిత వాటా కేటాయింపులు, కార్పొరేట్ దుష్పరిపాలన, ఏకపక్ష నిర్ణయాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అన్న‌పై దావా వేశారు. అయితే దయానిధి రూ.1500 కోట్లు చెల్లించాలని కోరగా, కళానిధి రూ.500 కోట్లు మాత్రమే ఇస్తాన‌ని చెప్ప‌డంతోనే ఆస్తుల గొడ‌వ ర‌చ్చకెక్కింద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కాగా, త‌నపై త‌మ్ముడు చేసిన ఆరోప‌ణల‌ను క‌ళానిధి కొట్టిపారేశారు. జూన్ 20న స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు అధికారికంగా వివ‌ర‌ణ ఇచ్చారు. పబ్లిక్ లిస్టింగ్‌కు ముందు స‌న్ నెట్‌వ‌ర్క్ కంపెనీకి చెందిన లావాదేవీలన్నీ చట్టబద్ధంగానే జ‌రిగాయ‌ని తెలిపారు. వ్య‌క్తిగ‌తంగానే త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని పేర్కొన్నారు.

స్టాలిన్ చొర‌వ‌.. స‌మసిన గొడవ‌
మార‌న్ సోద‌రుల మ‌ధ్య ఆస్తుల వివాదం ముదిరి పాకాన ప‌డ‌క ముందే ప‌రిష్కరించాల‌ని భావించిన సీఎం స్టాలిన్.. వారిద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డానికి స్వ‌యంగా రంగంలోకి దిగారు. తాను చేసిన ప్ర‌య‌త్నం విఫ‌లం కావ‌డంతో ఆయ‌న రూటు మార్చారు. త‌మ కుటుంబానికి అత్యంత స‌న్నిహితులైన వీర‌మ‌ణి, ఎన్‌. రామ్‌ల‌తో మంత్రాంగం న‌డిపించారు. ఇందులో భాగంగా మూడు ద‌ఫాల చ‌ర్చ‌లు జరిగాయని.. వాటిలో రెండు వ్యక్తిగతంగా, ఒకటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగాయి. అయితే అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఈ చర్చలు జరిగిన‌ట్టు విశ్వ‌స‌నీయ వర్గాలు తెలిపాయి. 

'మొదట మారన్ కుటుంబానికి వీరమణి ఫోన్ చేశారు. ఆ తర్వాత ఇతరులు కూడా చేరారు. జూన్ చివరి వారం నుంచి జూలై మొదటి వారం వరకు మూడు రౌండ్ల చర్చలు జరిగాయి. వివాదం గురించి ఇరు వ‌ర్గాలు మీడియాతో మాట్లాడకుండా ఉండాలని, స‌మ‌స్య ప‌రిష్కార దిశ‌గా ముందుకు సాగాలని మ‌ధ్య‌వ‌ర్తులు సూచించార‌'ని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వివాదం కారణంగా డీఎంకే, మారన్ కుటుంబానికి ప్రతిష్టకు కలిగే భంగం.. ఎక్కువ‌ కాలం వ్యాజ్యం కొనసాగడం వల్ల కలిగే న‌ష్టం, కోర్టు ఖర్చుల గురించి కూడా చర్చల్లో పెద్ద‌లు ప్రస్తావించిన‌ట్టు స‌మాచారం.

వారిద్ద‌రే ఎందుకు?
మార‌న్ సోద‌రుల ఆస్తుల గొడ‌వ ప‌రిష్కారానికి ఎంకే స్టాలిన్ (MK Stalin) వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయ కురువ‌`ద్ధుడైన వీరమణి, ప్ర‌ఖ్యాత జ‌ర్న‌లిస్ట్ ఎన్‌. రామ్‌ల‌ను ఎంచుకున్నారు. ఈ డిసెంబర్‌లో 93వ ఏట అడుగుపెట్ట‌నున్న వీర‌మ‌ణి త‌మిళ రాజ‌కీయాల్లో అత్యంత సీనియ‌ర్ నాయ‌కుడు. అంతేకాదు ద్రవిడ ఉద్యమంలో గౌరవనీయమైన వ్యక్తిగా ఆయ‌న గుర్తింపు ఉంది. ఇంకో కీల‌క అంశం ఏమిటంటే స‌న్ నెట్‌వ‌ర్క్‌తో ఆయ‌న ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు. స్టాలిన్ కుటుంబానికి మాత్రం ఇందులో 20 శాతం వాటా ఉంది. మారన్ కుటుంబానికి బంధువైన సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ (N Ram) సైద్ధాంతికంగా డీఎంకేకు దగ్గరగా ఉన్నారు. మీడియాలో విశ్వ‌స‌నీయ‌త ఆధారంగా మధ్యవర్తిత్వానికి ఆయ‌న‌ను స్టాలిన్ ఎంచుకున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో ఈ వివాదం పార్టీకి త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశం ఉంద‌న్న భావ‌న‌తో పరిస్థితిని చక్కదిద్దడానికి స్టాలిన్ జోక్యం చేసుకున్నారని డీఎంకే నేత ఒక‌రు వెల్ల‌డించారు.

వేర్వేరు రంగాల్లో..
కళానిధి, ద‌యానిధి తండ్రి దివంగత మురసోలి మారన్ (Murasoli Maran) కరుణానిధి మేనల్లుడు. డీఎంకే పార్టీ అండ‌తో ఆయ‌న ప‌లు ప‌ర్యాయాలు కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. ఆయ‌న బ‌తికున్నంత కాలం మార‌న్ కుటుంబంలో ఎటువంటి పొర‌పొచ్చాలు లేవు. ఇద్ద‌రు కుమారులు వేర్వేరు రంగాల్లోకి ప్ర‌వేశించి ముందుకెళ్లారు. కళానిధి 1993లో స‌న్ టీవీని ప్రారంభించి ప్రాంతీయ టెలివిజన్ మార్కెట్‌లో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ద‌యానిధి మార‌న్ తండ్రి వారసత్వాన్ని ఉప‌యోగించుకుని రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించి 2000లో కేంద్ర టెలికాం మంత్రి అయ్యారు.

అక్క‌డి నుంచే మొద‌లు..
మారన్ కుటుంబ వార్తాపత్రిక దినకరన్ కార్యాల‌యంపై 2007లో డీఎంకేలోని ఎంకే అళ‌గిరి (MK Alagiri) మ‌ద్ద‌తుదారులు దాడికి పాల్ప‌డ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. స్టాలిన్‌ను కరుణానిధి రాజకీయ వారసుడిగా పేర్కొంటూ దినకరన్ పేప‌ర్‌లో రావ‌డంతో కోపోద్రిక్తులైన అళగిరి మద్దతుదారులు హింసాత్మకంగా స్పందించారు. పెద్ద కొడుకునైన త‌న‌ను కాద‌ని స్టాలిన్‌ను రాజ‌కీయ వార‌సుడిగా వ‌ర్ణించ‌డంతో అళగిరి అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య దూరం కొన‌సాగుతోంది. తాజాగా మార‌న్ సోదరులు ఆస్తుల కోసం కోర్టుకెక్క‌డం త‌మిళ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయింది. 

చ‌ద‌వండి: ఇందిరా గాంధీపై శ‌శిథ‌రూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement