
క్రమశిక్షణ, శాంతి పేరుతో ఎన్నో దారుణాలు జరిగాయి: శశి థరూర్
సాక్షి, న్యూఢిల్లీ: అవకాశం వచ్చినప్పుడల్లా తన సొంత పార్టీపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ మరోసారి తన మాటలకు పదును పెట్టారు. 1975లో కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)పై విమర్శలు గుప్పించారు. అప్పట్లో క్రమశిక్షణ, శాంతి పేరుతో ఎన్నో దారుణాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గురువారం మలయాళ పత్రిక ‘దీపిక’లో రాసిన వ్యాసంలో కాంగ్రెస్ పార్టీపై శశి థరూర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో క్రమశిక్షణ పేరిట చేపట్టిన చర్యలు ఎన్నో దారుణాలకు దారితీశాయని, అవి క్షమించరాని తప్పులని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం అని తేల్చిచెప్పారు. ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ చేపట్టిన బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమం అత్యవసర పరిస్థితి కాలంలో జరిగిన దారుణాలకు పెద్ద ఉదాహరణగా నిలిచిందని స్పష్టంచేశారు.
గ్రామాల్లో నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవడం కోసం హింస, బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. ఢిల్లీ వంటి నగరాల్లో పేదల గుడిసెలను నేలమట్టం చేసి వేలాది మంది ప్రజలను నిరాశ్రయులుగా మార్చారని ఆక్షేపించారు. ఇళ్లు కోల్పోయిన పేదల పునరావాసం, సంక్షేమం గురించి అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఆసక్తి చూపలేదని వెల్లడించారు. అప్పటి దురాగతాలకు ప్రధాని ఇందిరా గాంధీ మద్దతు పలికారని ఆరోపించారు. ప్రత్యర్థులను జైల్లో పెట్టడం, ప్రజల ప్రాథమిక హక్కులను హరించడం, పత్రికలపై ఆంక్షలు విధించడం, చట్టాలను ఉల్లంఘించడం వంటివి మన రాజకీయాల్లో ఒక మచ్చగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమర్జెన్సీని దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తుచేశారు.
My column for a global audience on the lessons for India and the world of the Emergency, on its 50th anniversary @ProSyn https://t.co/QZBBidl0Zt
— Shashi Tharoor (@ShashiTharoor) July 9, 2025
ప్రజాస్వామ్య పరిరక్షకులు అప్రమత్తంగా ఉండాలి
ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ తక్కువ చేసి చూడరాదని, ఇది మనకు దక్కిన విలువైన సంపద అని శశి థరూర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మనదేశం 1975లోని భారత్ కాదన్న విషయం గుర్తుంచుకోవాలని... మనం ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నామని, మరింత అభివృద్ధి సాధించామని, బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉన్నామని వివరించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థే మన బలమని ఉద్ఘాటించారు. అత్యవసర పరిస్థితి నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఉన్నాయని వివరించారు. అధికారాన్ని ఒకచోటే కేంద్రీకరించడం, విరుద్ధ స్వరాలను అణచివేయడం, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడం వంటి దుష్పరిణామాలు మళ్లీ వేరే రూపాల్లో ప్రత్యక్షం అవుతూనే ఉంటాయన్నారు. దేశ ప్రయోజనాలు, సుస్థిరత అనే సాకులతో అలాంటి వాటిని సమర్థించడానికి ప్రయత్నిస్తారని చెప్పారు.
కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షకులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. అత్యవసర పరిస్థితి మనకు ఎప్పటికీ ఒక పెద్ద హెచ్చరిక అని శశి థరూర్ తేల్చిచెప్పారు. మరోవైపు ఎమర్జెన్సీ పట్ల శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.డి.సతీశన్, కె.మురళీధరన్ స్పందించారు. ఎప్పుడో విధించిన ఎమర్జెన్సీపై ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. శశి థరూర్ వ్యవహార శైలిపై తమ పార్టీ నాయకత్వం తగిన సమయంలో స్పందిస్తుందని పేర్కొన్నారు.