
నిర్మాణాత్మక సమస్యల వల్ల పెండింగ్‌లో ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)-యాజమాన్యాల కేసుల పరిష్కారానికి మోక్షం లభించనుంది. చట్టపరమైన అవాంతరాలను తగ్గించడానికి, పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు, యాజమాన్యాలతో ఉన్న వివాదాలను తొలగించుకునేందుకు ఈఎస్ఐసీ ‘ఆమ్నెస్టీ స్కీమ్ 2025’ను ఆమోదించింది. ఇది 15 సంవత్సరాలకు పైగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 27,000 చట్టపరమైన కేసుల పరిష్కారానికి దారితీస్తుందని నమ్ముతున్నారు.
కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఇటీవల సిమ్లాలో జరిగిన 196వ ఈఎస్ఐ కార్పొరేషన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆమ్నెస్టీ పథకం
ఆమ్నెస్టీ పథకం అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు అమలులో ఉంటుంది. ఈఎస్ఐసీతో ముడిపడి ఉన్న వివాదాలను కోర్టు వెలుపల పరిష్కరించడానికి నిర్మాణాత్మక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో జ్యుడీషియరీ జోక్యం తగ్గుతుంది. పరిపాలనా మార్గాల ద్వారా వివాదాలను వేగంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం.
పెండింగ్‌లో ఇన్ని కేసులు ఎందుకు?
మార్చి 31, 2025 నాటికి యజమానులు, ఈఎస్ఐసీకి సంబంధించిన సుమారు 27,000 చట్టపరమైన కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కోత్‌కతాలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఈఎస్ఐసీ చేసిన బీమా విరాళాల తాత్కాలిక మదింపులకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. యజమానులు ఈ మదింపులను వ్యతిరేకించిన సందర్భాల్లో ఇన్సూరెన్స్ కోర్టులను ఆశ్రయించారు. దాంతో చట్టపరమైన సవాళ్ల వల్ల చాలాకాలంపాటు పెండింగ్‌లో ఉంటున్నాయి.
ఆమ్నెస్టీ పథకంలోని కీలక నిబంధనలు
యజమానులు తాత్కాలిక మదింపులపై అదనపు ఛార్జీలు లేకుండా వాస్తవ విరాళాలు, వాటిపై వర్తించే వడ్డీని మాత్రమే చెల్లించడం ద్వారా వివాదాలను పరిష్కరించవచ్చు.
ఇప్పటికే బకాయిలు చెల్లించినట్లయితే యజమానులు వివాదాస్పద నష్టపరిహారం లేదా పెనాల్టీలో కేవలం 10% చెల్లించడం ద్వారా కోర్టు కేసులను ఉపసంహరించుకోవచ్చు.
రికార్డులను సమర్పించకపోవడం లేదా ఆలస్యంగా చెల్లింపులు చేసినందుకు ఈఎస్ఐసీ దాఖలు చేసిన చట్టపరమైన కేసులు కూడా కోర్టు ఆమోదానికి లోబడి ఉపసంహరించుకోవచ్చు.
క్రిమినల్ కేసులు
ఈఎస్ఐసీ తుది నిర్ణయం తర్వాత యజమానులు కోర్టులను ఆశ్రయించిన కేసుల్లో ఉపశమనం లభించదు.
27,000 కేసుల్లో కొన్ని ఈఎస్ఐ చట్టంలోని సెక్షన్ 85 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి. ఇందులో కంట్రిబ్యూషన్లు చెల్లించడంలో వైఫల్యం, తప్పుడు రిటర్నులు సమర్పించడం వంటి కేసులున్నాయి.
ఈ నేరాలు జైలు శిక్ష /జరిమానాలకు దారితీయవచ్చు. ప్రస్తుత చట్రంలో క్షమాభిక్షకు కూడా అర్హులు కాకపోవచ్చు.
ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే..