
విదేశీ కంపెనీలకు సైతం ప్రిజంప్టివ్ పన్ను పథకాన్ని ప్రవేశపెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ కీలక సూచన చేసింది. దీనివల్ల సులభత్వం, స్పష్టత ఏర్పడుతుందని పేర్కొంది. శాశ్వత ఏర్పాటుకు సంబంధించి వివాదాలకు ఐచ్ఛిక ప్రిజంప్టివ్ పన్ను విధానం ముగింపు పలుకుతుందని అభిప్రాయపడింది. ప్రిజంప్టివ్ పన్ను పథకం కింద.. కంపెనీల వాస్తవ లాభాలు, వ్యయాలతో సంబంధం లేకుండా స్థిర, ముందస్తుగా నిర్ణయించిన రేటుపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల కంపెనీలపై నిబంధన అమలు భారం తగ్గుతుంది.
అకౌంట్ పుస్తకాలను నిర్వహించే భారం ఉండదు. విదేశీ కంపెనీలకు సైతం దీన్ని అమలు చేయడం వల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందన్నది నీతి ఆయోగ్ అభిప్రాయం. దీర్ఘకాలిక సమస్యకు ఇది ఆచరణాత్మక పరిష్కారం కాగలదని పేర్కొంది. అంతర్జాతీయంగా వ్యాపార సూచీల్లో భారత్ స్థానం మెరుగుపడుతుందని పేర్కొంది.
ఈ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘స్థిరమైన, స్పష్టమైన, ఊహించతగిన పన్ను విధానం అన్నది పెట్టుడులకు, ఆర్థిక వృద్ధికి ఎంతో అవసరం. పెట్టుబడిదారులకు లేదా వ్యాపారాలకు అనిశ్చితి అన్నది ఎంత మాత్రం మంచిది కాదు. 2047 నాటికి వికసిత్ భారత్‌గా అవతరించాలన్నది లక్ష్యం. ఇందుకు గాను వేగంగా వృద్ధి చెందాల్సి ఉంటుంది. ప్రజలకు తగినన్ని ఉపాధి అవకాశాలు చూపించాలి. వీటన్నింటికీ పెట్టుబడులు, ఊహాత్మక వ్యాపార వాతావరణం అవసరం’అని సుబ్రమణ్యం పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల తగ్గింపునకు ప్రోత్సాహకం