
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పేదలు, కూలీలు, ఆటోడ్రైవర్లు, విద్యార్థులు వంటి వర్గాల భోజన భద్రతను మరింత బలోపేతం చేస్తూ ఇవాళ (సెప్టెంబర్ 29, సోమవారం) క్యాంటీన్‌లు ప్రారంభమయ్యాయి. మోతీనగర్, ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో ఏర్పాటు చేసిన క్యాంటీన్లను మంత్రి పొన్నం ప్రభాకర్ , మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు.
భోజనం కేవలం రూ.5కే అందించే ఈ ప్రత్యేక పథకం ఇప్పటికే వేలాది మందికి ఆపన్నహస్తంగా నిలుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం 150 క్యాంటీన్లు నడుస్తుండగా, రోజుకు సగటున 30 వేల మంది లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు 12.3 కోట్ల భోజనాలు పంపిణీ చేయగా, రూ.254 కోట్లకుపైగా వెచ్చించారు. ఈ కొత్త క్యాంటీన్లలో ఆధునిక ఫుడ్ కంటైనర్లు, కూర్చునే సదుపాయం, తాగునీటి ఆర్వో ప్లాంట్, చేతులు శుభ్రం చేసుకునే వసతి, డ్రైనేజీ , ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు కల్పించబడ్డాయి.
లబ్ధిదారులకు రుచి, శుచితో కూడిన భోజనం అందించడం వీటి ప్రధాన లక్ష్యం. ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్ కూడా అందించే ప్రణాళికలు త్వరలో అమలులోకి రానున్నాయి. ఇందిరమ్మ క్యాంటీన్ల ప్రారంభోత్సవం ఆకలిలేని హైదరాబాద్ దిశగా మరొక అడుగుగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.