భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. స్వయం ఉపాధి సాధించాలనుకుంటున్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం ‘ఉద్యోగిని’ పథకం ద్వారా అండగా నిలుస్తోంది. దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఆర్థికంగా స్థిరపడేలా చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు వడ్డీ లేని రుణాలు లేదా తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తున్నారు. దాంతోపాటు రుణాల చెల్లింపులో సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఇంతకీ ఈ పథకానికి ఎవరు అర్హులు.. దరఖాస్తు విధానం.. వడ్డీ.. వంటి వివరాలు చూద్దాం.
‘ఉద్యోగిని’ పథకం వివరాలు
‘ఉద్యోగిని’ అనేది కేంద్ర ప్రభుత్వం (కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో) అమలు చేస్తున్న పథకం. ఇది మహిళలు సొంతంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఎవరు అర్హులు?
దరఖాస్తుదారు మహిళ వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం సాధారణంగా రూ.2,00,000 మించకూడదు.
కొన్ని వర్గాల మహిళలకు (ఉదా: వితంతువులు, వికలాంగులు, దళిత మహిళలు) ఈ వార్షిక ఆదాయ పరిమితి వర్తించదు.
దరఖాస్తుదారు ఇంతకుముందు ఏ ఆర్థిక సంస్థ నుంచి తీసుకున్న రుణాలకూ ఎగవేతదారుగా (Defaulter) ఉండకూడదు.
కొన్ని రాష్ట్రాల్లో (ఉదా: కర్ణాటక) ఆ రాష్ట్ర శాశ్వత నివాసితులై ఉండాలి. పథకం అమలు తీరు రాష్ట్రాల వారీగా స్వల్పంగా మారవచ్చు.
లోన్ ఎంత వరకు ఇస్తారు?
ఈ పథకం కింద మహిళలు గరిష్టంగా రూ.3,00,000 వరకు రుణం పొందవచ్చు. ఈ రుణానికి మహిళలు ఎలాంటి సెక్యూరిటీ/ హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
లోన్‌ను ఎప్పటిలోపు తీర్చేయాలి?
సాధారణంగా ఈ లోన్ తిరిగి చెల్లించడానికి బ్యాంకులు 3 నుంచి 7 సంవత్సరాల వరకు సమయాన్ని ఇస్తాయి. ఇది తీసుకున్న లోన్ మొత్తం, వ్యాపార స్వరూపం, బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
దరఖాస్తు విధానం
ఉద్యోగిని పథకాన్ని కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్లు అందిస్తాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయా సంస్థల వద్దకు వెళ్లి అధికారులతో మాట్లాడాలి.
దరఖాస్తుదారులు తమకు దగ్గరలోని పైన పేర్కొన్న బ్యాంకు శాఖను సందర్శించాలి.
దరఖాస్తు పత్రాన్ని నింపి, అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలి.
రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.
వడ్డీ వివరాలు..
షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వికలాంగులు (Disabled), వితంతువులు (Widows) వంటి ప్రత్యేక వర్గాలకు చెందిన మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తారు. లోన్ మొత్తంలో 50% వరకు సబ్సిడీ (గరిష్టంగా దాదాపు రూ.90,000 వరకు) లభిస్తుంది. అంటే కొంత లోన్‌ను ప్రభుత్వమే భరిస్తుంది.
ఇతర వర్గాల మహిళలకు..
జనరల్, ఓబీసీ మహిళలకు వడ్డీ 10% నుంచి 12% మధ్య ఉంటుంది. ఈ వడ్డీ రేటు బ్యాంకు, ఈ పథకం రాష్ట్ర వాటా అమలును బట్టి స్వల్పంగా మారవచ్చు. వీరికి కూడా లోన్ మొత్తంలో 30% వరకు సబ్సిడీ లభిస్తుంది.
కావాల్సిన పత్రాలు
పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్
ఆధార్ కార్డు
పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
చిరునామా ధ్రువీకరణ పత్రం
కుటుంబ వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం
కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
బీపీఎల్ కార్డు (ఉంటే)
పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
ఏ వ్యాపారానికి దరఖాస్తు చేస్తున్నారో దాని ప్రణాళిక (Business Plan)
ఎలాంటి బిజినెస్ ఐడియాలు ఉండాలి?
ఈ పథకం ద్వారా దాదాపు 88 రకాల చిన్న వ్యాపారాలకు రుణాలు అందిస్తున్నారు.
ఉదాహరణకు:
అగరబత్తీలు/కొవ్వొత్తుల తయారీ
బేకరీ, క్యాంటీన్, కేటరింగ్ సేవలు
గాజుల తయారీ
బ్యూటీ పార్లర్
వంట నూనెల వ్యాపారం
పండ్లు, కూరగాయల అమ్మకం
చేనేత/వస్త్రాలపై ఎంబ్రాయిడరీ పనులు
పాలు/డెయిరీ ఉత్పత్తుల యూనిట్
పాపడ్/జామ్/జెల్లీ తయారీ
పుస్తకాలు/నోట్‌బుక్స్ తయారీ
క్లీనింగ్ పౌడర్, కాఫీ, టీ పౌడర్ తయారీ మొదలైనవి.
ఈ వ్యాపారాలకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.
ఇదీ చదవండి: రైలులో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారా?


