దూర ప్రయాణమంటే మొదటగా గుర్తొచ్చేది భారతీయ రైల్వే సర్వీసు. బస్సు, విమానాల కంటే లగేజీ సరఫరా సదుపాయం రైలులో ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు దేశంలోని మారుమూల ప్రాంతాలను సైతం రైల్వేలు అనుసంధానించడం వంటి కారణాల వల్ల కోట్లాది మంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే, రైలు ప్రయాణం చేసే చాలా మందికి సాధారణంగా ‘రైలులో మద్యం తీసుకువెళ్లవచ్చా?’ అనే అనుమానం ఉంటుంది. ఆల్కహాల్ సరఫరాలో రైల్వే నిబంధనలు ఎలా ఉన్నాయో చూద్దాం.
రైలు ప్రయాణంలో మద్యం తీసుకువెళ్లడం గురించి ప్రయాణీకులలో తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం రైల్వే నిబంధనలు రాష్ట్రాల వారీగా ఉన్న ఎక్సైజ్ నియమాలతో ముడిపడి ఉండటమే. సీనియర్ రైల్వే అధికారులు స్పష్టం చేసినట్లుగా రైళ్లలో మద్యం బాటిళ్లను తీసుకువెళ్లడం నిషేధం. రైళ్లలో మద్యం సేవించడం, రవాణా చేయడం అనేది ఇతర ప్రయాణీకులకు అసౌకర్యాన్ని, భద్రతా ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉన్నందున రైల్వే దీన్ని అనుమతించదు. రైళ్లను సురక్షితంగా నడపడం కోసం విధి నిర్వహణలో సిబ్బంది మద్యం సేవించకుండా కూడా రైల్వే కఠినంగా నిరోధిస్తుంది.
చట్టం ఏం చెబుతోంది?
రైల్వే చట్టం, 1989 సెక్షన్ 165 ప్రకారం, రైలులో లేదా రైల్వే ప్రాంగణంలో మద్యం సేవించడం లేదా మత్తులో ఇతరులకు ఇబ్బంది కలిగించడం పూర్తిగా నిషేధం. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: కశ్మీర్ లోయలో విచ్చలవిడిగా పురుగుమందుల వాడకం


