
ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి నటీనటులు చాలామంది నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. రెమ్యునరేషన్ల దగ్గర నుంచి షూటింగ్ జరిగే సమయంలో సదుపాయాల వరకు నిర్మాతని చాలానే ఇబ్బంది పెడుతున్నారు. కాకపోతే వీటి గురించి చెప్పుకొంటే మళ్లీ ఎక్కడ సినిమా సమస్యల్లో పడుతుందోనని నిర్మాతలు సైలెంట్‌గా ఊరుకుంటున్నారు. అలాంటిది 'కూలీ' ప్రొడ్యూసర్ కళానిధి మారన్ మాత్రం కుండ బద్దలు కొట్టేశారు. కొందరు హీరోల నిజస్వరూపం గురించి చెప్పి, సెటైర్లు వేశారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
రజినీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. శనివారం సాయంత్రం చెన్నైలోని జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన నిర్మాత కళానిధి మారన్.. 'ఈ రోజుల్లో కొందరు సక్సెస్‌ఫుల్ యాక్టర్స్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు. రెండు హిట్స్ పడగానే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. కొందరైతే ప్రైవేట్ జెట్స్ అడుగుతున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. దేశంలోని ఒకే ఒక్క సూపర్‌స్టార్ ఈయనే' అని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ‘ఢీ’ కొరియోగ్రాఫర్‌పై పోక్సో కేసు, అరెస్ట్!)
రజినీకాంత్ గురించి నిర్మాత చెప్పడం, ఆయన ఎలివేషన్లు ఇవ్వడం బాగానే ఉంది. మరి కళానిధి మారన్.. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన కొందరి హీరోల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈయన వాళ్ల గురించి చెప్పారా? లేదా జనరల్‌గా ఇండస్ట్రీలో హీరోల తీరు గురించి చెప్పారా అనేది సస్పెన్స్.
'కూలీ' విషయానికొస్తే రజినీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. శనివారం సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. కాకపోతే పెద్దగా హై అనిపించలేదు. కానీ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంపై హైప్ గట్టిగానే ఉంది. మరి ఆగస్టు 14న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)