
అరవై ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు 2025కు తాజాగా ఆమోదం లభించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న భారత నూతన ఆదాయపు పన్ను బిల్లు 2025లో ప్రధాన మార్పులు కింది విధంగా ఉన్నాయి.
కొత్త పన్ను బిల్లులోని కీలక సంస్కరణలు
అద్దె ఆదాయం నుంచి మున్సిపల్ పన్నులను మినహాయించిన తర్వాత ప్రామాణిక మినహాయింపు(స్టాండర్డ్ డిడక్షన్) వర్తిస్తుంది.
స్వీయ-ఆక్రమిత ఆస్తులకు మాత్రమే కాకుండా, ఖాళీ చేసిన ఆస్తులపై వడ్డీ తగ్గించేలా నిబంధనల్లో మార్పులు చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు, భూస్వాములకు ప్రయోజనం చేకూరనుంది.
కార్పొరేట్, బిజినెస్ ప్రొవిజన్స్
కొత్త పన్ను విధానం కింద కార్పొరేషన్లు ఇప్పుడు సెక్షన్ 80ఎం కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. డివిడెండ్ ఆదాయంలో పన్ను తగ్గించుకోవచ్చు.
కంపెనీలకు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) వర్తిస్తుంది.
మినహాయింపులను క్లెయిమ్ చేసే నాన్-కార్పొరేట్ సంస్థలకు ఆల్టర్నేటివ్ మినిమమ్ ట్యాక్స్ (ఏఎంటీ) వర్తిస్తుంది.
అధిక సంపాదన కలిగిన వారు(రూ.50 కోట్లు+ రశీదులు) నిర్దేశిత ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులను తప్పనిసరిగా ఉపయోగించడం వల్ల ఆడిట్ మార్గాలు మెరుగుపడతాయి. లెక్కల్లోకి రాని ఆదాయాన్ని అరికట్టవచ్చు.
ధార్మిక ప్రయోజనాల కోసం ఉపయోగించే మూలధన లాభాలను ఇకపై ‘ఆదాయ అనువర్తనం(అప్లికేషన్ ఆఫ్ ఇన్‌కమ్)’గా పరిగణిస్తారు. ఇది నిధుల కేటాయింపులో సౌలభ్యాన్ని పెంచుతుంది. ట్రస్టులు ఇకపై కూడబెట్టిన ఆదాయంలో 15% నిర్దిష్ట పద్ధతుల్లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మరింత అనుకూలమైన ఆర్థిక ప్రణాళికకు ఉపయోగపడుతుంది.
స్నేహపూర్వక చర్యలు
నిర్దిష్ట పరిస్థితుల్లో ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసేవారు కూడా ఇప్పుడు రిఫండ్‌లను క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆలస్యానికి తగిన రుజువులు జతచేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పన్ను అధికారులకు నిబంధనలు అతిక్రమించిన వారిపై విధించిన జరిమానాలను మాఫీ చేసే విచక్షణ ఉంటుంది. ఇది పన్ను చెల్లింపుదారుల హక్కులకు అనుగుణంగా ఉంటుంది. అయితే అందుకు తగిన కారణాలను సమర్పించాలి.
ఇదీ చదవండి: దిగొస్తున్న కనకం ధరలు!
పన్నులు మారుతాయా?
కొత్త ఆదాయపన్ను బిల్లు 2025 అమల్లోకి రానున్న నేపథ్యంలో చాలామంది తాము ఏమేరకు పన్ను చెల్లించాలనేదానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం గతంలో చెప్పినదాని ప్రకారమే పన్ను శ్లాబులు ఉంటాయి. అందులో ఎలాంటి మార్పులు ఉండవు. కేంద్రం గతంలో ప్రవేశపెట్టిన కొత్త శ్లాబుల ప్రకారం.. రూ.12,00,000 ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.