ఆపరేషన్‌ సిందూర్‌.. స్టాక్‌ మార్కెట్‌పై ‍ప్రభావం ఎంత? | how operation sindoor impacts indian stock market for short time | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ సిందూర్‌.. స్టాక్‌ మార్కెట్‌పై ‍ప్రభావం ఎంత?

May 7 2025 11:47 AM | Updated on May 7 2025 2:53 PM

how operation sindoor impacts indian stock market for short time

భారత త్రివిధ దళాల సహాయంతో ఆర్మీ బలగాలు పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయి. ఇందులో సుమారు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. గతంలో జమ్మూకశ్మీర్‌లో భారత పర్యాటకులను ఊచకోత కోసిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్‌ దాయాది దేశంపై పంజా విసిరింది. పాకిస్థాన్‌లోని సాధారణ ప్రజలపై కాకుండా ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. దీనిపై సానుభూతి కోసం పాక్‌ ఇతర దేశాల సాయం కోరకుండా భారత్‌ చాకచక్యంగా వ్యవహరించింది. తాజా దాడుల నేపథ్యంలో భారత స్టాక్‌ మార్కెట్‌లో ఎలాంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం.

మార్కెట్ రియాక్షన్

మార్కెట్‌ ప్రారంభమైన కాసేపటికి నిఫ్టీ 50 24,400 పాయింట్ల దిగువకు, సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయింది. గిఫ్ట్ సిటీలోని నిఫ్టీ 50లో ఫ్యూచర్స్ సుమారు 1.19% క్షీణించింది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగిన ఈ ఆపరేషన్ తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని కొందరు భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనలకు కారణమవుతుంది.

పరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్‌ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్‌ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. 

ఎఫ్‌ఐఐలు కీలకం

24-48 గంటల్లో ఈ పరిస్థితి అదుపులోకి వస్తే మార్కెట్లు ముందుకు సాగవచ్చని కొందరు సూచిస్తున్నారు. అయితే, దీర్ఘకాలిక ఉద్రిక్తతలు కొనసాగితే మాత్రం కొంతకాలం మార్కెట్లో దిద్దుబాటుకు దారితీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొనుగోలుదారులుగా ఉంటున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) ప్రతికూలంగా ప్రతిస్పందిస్తే కొంత కాలం అనిశ్చితులు కొనసాగవచ్చు.

ఇదీ చదవండి: ఎన్‌బీఎఫ్‌సీ గోల్డ్‌ లోన్లకు కష్టాలు

గతంలో ఇలా..

ఇండో-పాక్ ఘర్షణల నేపథ్యంలో మార్కెట్లు గతంలోనూ కొంత ఒడిదొడుకులకు లోనయ్యాయి. 2019 బాలాకోట్ వైమానిక దాడుల తరువాత సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్‌ సెషన్‌ ప్రారంభంలో పడిపోయినప్పటికీ మరుసటి రోజు తిరిగి పుంజుకున్నాయి. పహల్గాం దాడి తర్వాత మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు నిర్ణయాలు, చైనా లిక్విడిటీ చర్యలు వంటి అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం మార్కెట్‌లో కొంత సానుకూల సెంటిమెంట్‌ను తీసుకొచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement