
క్రిసిల్ రేటింగ్స్ నివేదిక అంచనా
ఆర్‌బీఐ ప్రతిపాదించిన నూతన ముసాయిదా నిబంధనలు ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) బంగారం రుణ ఆస్తులు నిదానించేలా చేస్తాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. లోన్ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణం), రుణాల పునరుద్ధరణ, టాపప్ బుల్లెట్ రుణాలపై ఈ ముసాయిదా దృష్టి పెట్టిందని.. ఈ నిబంధనలు ఎన్‌బీఎఫ్‌సీ రుణ ఆస్తుల వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముసాయిదా నిబంధనలు విడుదల చేసిన ఆర్‌బీఐ, భాగస్వాముల అభిప్రాయాలను ఆహ్వానించింది.
బంగారం రుణాల విషయంలో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య వ్యత్యాసాలు తగ్గించి, ఏకరూపత తీసుకురావడం ముసాయిదా నిబంధనల లక్ష్యంగా ఉంది. బంగారం రుణాల విషయంలో అసాధారణ ప్రక్రియలను ఎన్‌బీఎఫ్‌సీలు పాటిస్తుండడం, బంగారం విలువపై అధిక నిష్పత్తిలో రుణాలు జారీ చేస్తుండడంపై ఆర్‌బీఐ గతేడాది సెప్టెంబర్‌లో కాస్తంత హెచ్చరించే ధోరణిని వ్యక్తం చేయడాన్ని నివేదిక ప్రస్తావించింది. 2024–25లో వ్యవస్థ వ్యాప్తంగా బంగారం రుణాలు 50 శాతానికి పైనే పెరిగాయని, బ్యాంక్‌ల బంగారం రుణ ఆస్తుల విలువ రెట్టింపైనట్టు పేర్కొంది.
ఆభరణాలపై తక్కువ రుణాలు..
ఎల్‌టీవీపై ఆర్‌బీఐ కొత్త నిబంధనల కింద ఎన్‌బీఎఫ్‌సీలు బంగారం రుణాల మంజూరు విలువను క్రమబద్దీకరించుకోవాల్సి వస్తుందని తెలిపింది. బుల్లెట్ రుణాలకు సంబంధించిన ఎల్‌టీవీ ప్రస్తుతమున్న 65–68 శాతం నుంచి 55–60 శాతానికి దిగొస్తుందని అంచనా వేసింది. దీంతో అంతే విలువ కలిగిన బంగారం ఆభరణాలపై మంజూరు చేసే రుణం తగ్గుతుందని తెలిపింది. కస్టమర్ల వద్ద నుంచి నిర్ణీత రోజులకు ఒకసారి (నెల) బంగారం రుణంపై వడ్డీని ఎన్‌బీఎఫ్‌సీలు వసూలు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, ఈ సంస్థలు ఈఎంఐ ఆధారిత బంగారం రుణాలపై దృష్టి పెట్టొచ్చని తెలిపింది.
ఇదీ చదవండి: దేశంలో మారుతున్న ఉద్యోగుల ప్రాధాన్యతలు
ఎల్‌టీవీ పరిమితి మించితే అదనపు నిధుల కేటాయింపులు చేయాలన్న నిబంధన ఎన్‌బీఎఫ్‌సీలపై పెద్ద ప్రభావం చూపించకపోవచ్చని అభిప్రాయపడింది. ఆర్‌బీఐ ప్రతిపాదిత నిబంధనలు కొంత కాలానికి ఈ రంగం సామర్థ్యాలను బలోపేతం చేస్తాయని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది.